Nizamabad News : గలగలా మాట్లాడే చిన్నారి స్వరం ఒక్కసారిగా మూగబోయింది. ఏడేళ్ల వయసులో మాట ఆగిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు చెప్పలేనంత వేదనకు గురయ్యారు.  ఒక్కసారిగా మాట పడిపోవటంతో ఏం చేయాలో వారికి తోచలేదు.చిన్నారి వైద్యం కోసం స్థోమతకు మించి ఖర్చు చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులు బిడ్డకు ఇంక మూటలు రావని భావించారు. కానీ 12 ఏళ్ల తర్వాత సడన్ గా ఆ గొంతు మళ్లీ పలికింది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా చెబుతున్నారు. 


అసలేం జరిగింది? 


నిజామాబాద్ జిల్లా భీంగ‌ల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన యువతి పేరు సుజాత వయసు 19. ఏడేళ్ల వయస్సులో గొంతు మూగ‌బోయింది. నోటి నుంచి మాట ఆగిపోయింది. అప్పటి వ‌ర‌కు చక్కగా మాట్లాడే సుజాత చదువులోనూ ముందుండేది. ఒక్కసారిగా గొంతు మూగబోయి మాట రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చికిత్స కోసం అనేక మంది డాక్టర్లకు చూపించి. మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. ఇక మూగ అమ్మాయిగానే స్కూల్ కు వెళ్లి టెన్త్, ఇంటర్ పూర్తి చేసింది సుజాత. ఇక ఆమెకు జీవితాంతం మాటలు రావని అలాగే జీవించాల్సి వస్తుందని త‌ల్లిదండ్రులు అనుకున్నారు. వారి ఆర్థిక స్తోమ‌త అంతంత మాత్రంగానే ఉంది.  ముగ్గురు కూతుళ్లలో చిన్న కూమార్తె సుజాత. అయితే స‌డ‌న్ గా 12 ఏళ్ల తర్వాత సుజాతకు మాటలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.. సుజాత కుటుంబ సభ్యులు ఆనందానికి ఆవ‌దులు లేకుండాపోయాయ్.


చిన్నాన్న మరణ వార్త విని 


12 సంవత్సరాల క్రితం సుజాత చిన్నాన్న చనిపోయాడు. ఆ  విషయం తెలుసుకున్న సుజాత ఒక్కసారిగా షాక్ కు గురైంది. బాగా వెక్కివెక్కి ఏడ్వడంతో సుజాత గొంతు ఒక్కసారిగా మూగబోయింది. నాటి నుంచి సుజాత  గొంతు మూగ‌బోయింది. పన్నెండేళ్ల తర్వాత మాట రావడం చాలా సంతోషంగా ఉందని తల్లి చెబుతోంది. దేవుడు దయవల్ల ఇప్పటికైనా మాట వచ్చినందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంత ప్రయ‌త్నించినా తనకు మాట రాలేద‌ని సుజాత చెబుతున్నారు. తోటి విద్యార్థులు తనకు మాటలు రావని చెప్పుకుంటే బాధపడేదాన్ని అంటోంది. 12 సంవ‌త్సరాల త‌రువాత మళ్లీ మాటలు రావడం ఆశ్చర్యంగా ఉంద‌ంటోంది. సుజాతకు చదువంటే చాలా ఇష్టం చదువుకొని మంచి జాబ్ చేయాలని ఉండేదని అయితే తన చ‌దువు మ‌ధ్యలోనే ఆగిపోయిందని ఆవేద‌న వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ చదువును కంటిన్యూ చేస్తానని చెబుతోంది.  


 అరుదుగా ఇలాంటి ఘటనలు 


12 ఏళ్ల తర్వాత సుజాత‌కు మాట‌లు రావ‌డంతో స్థానికులు, బంధువులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. విష‌యం తెలిసిన వారు సుజాత‌తో మాట్లాడుతున్నారు. సుజాతకు సహజ సిద్ధంగా మాటలు వచ్చాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి అరుదుగా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయంటున్నారు. సుజాతకు మాటలు వచ్చాయని తెలియటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.