యాసంగిలో వరి వెయ్యొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకున్నా... నిజామాబాద్ జిల్లా రైతన్నలు వరి సాగుకే మొగ్గుచూపారు. ప్రత్యామ్నయం వైపు వెళ్లకుండా సంప్రదాయంగా వస్తున్న వరి పంటకే సై అన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 శాతం రైతులు వరి పంటనే వేశారు. మిగిలిన రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లారు. యాసంగిలో వరిసాగుతో వచ్చే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలని సూచించిన రైతులు మాత్రం తగ్గేదే లే అన్నారు. వానాకాలం సీజన్‌కు చెందిన బియ్యాన్నే కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టిన కేంద్రం…. యాసంగిలో ఒక్క బియ్యం గింజ కూడా కొనేలా కనిపించని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంటు కూడా చేయించుకున్నది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం..వరి వేసుకుంటే తమకు సంబంధం లేదన్నట్లుగా స్పష్టం చేసింది.
ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని, ధాన్యాన్ని అసలే కొనుగోలు చేయబోమని, ముందుగా మిల్లర్లతో ఒప్పందం ఉంటేనో లేదంటే … బయట విక్రయంచుకునే వీలుంటేనే వరి వైపు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వరి కాకుండా అన్నదాతలు ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లాలని సూచించింది. అయితే ప్రత్యామ్నయంపై ఎలాంటి ప్రోత్సాహకాలు గానీ విధి విధానాలు గాని రైతులకు వివరించని పరిస్థితి. ఉదాహరణకు పొద్దు తిరుగుడు పువ్వు, జోన్న, సోయా, మొక్క జోన్న, కూరగాయలు వంటి పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు మార్కెట్లో భారీగా చలామణి అవుతున్నాయ్. గతంలో సోయా సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల ధాటికి దిగుబడి రాక నష్టాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యామ్నయ పంటల విత్తనాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో గత వానాకాల సీజన్ లో విస్తృతంగా వర్షాలు కురిశాయ్. ప్రాజెక్టులు, చెరువులు నిండాయ్. భూగర్భ జలాలు పెరిగాయ్. సమృద్ధిగా నీరు ఉంది. 24 గంటల కరెంట్ ఉచితంగా వస్తోంది. వీటితో పాటు సంప్రదాయంగా వస్తున్న వరి సాగు వైపై రైతులు మొగ్గుచూపారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులకు వరి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదు. యాసంగి సీజన్ దాదాపుగా పూర్తయింది. వరి సాగు సుమారు 75 నుంచి 80 శాతం విస్తీర్ణంలో సాగులోకి రానుంది. వరి పంట 3 నెలలకు చేతికి వస్తుంది. ధాన్యం వచ్చే సమయానికి పరిస్థితి ఏంటీ ? అప్పుడు వరి ధాన్యాన్ని ఎవరు కొనాలి ? అన్నదానిపై ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు నెలకొని అవకాశం లేకపోలేదు. మిల్లర్లు ఎంత కొన్నా 30శాతానికి మించదు. మిగిలిన 50 శాతం సాగైన వరి ధాన్యం పరిస్థితేంటి..? ఆ ధాన్యాన్ని రైతులు ఎవరికి అమ్ముకోవాలి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: Minister Harish Rao: తెలంగాణలో ఫీవర్ సర్వే.. వైరస్ లక్షణాలు గుర్తిస్తే హోం ఐసోలేషన్ కిట్లు