అకాల వర్షాలతో పంటలు నష్టపోయి పసుపు రైతులకు 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.... అకాల వర్షాల వల్ల వచ్చిన పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర లేక పసుపు రైతులు పూర్తిగా నష్టపోతున్నారని అన్నారు. ప్రతి ఏటా ప్రారంభంలో ఉన్న ధర పంట పూర్తిగా చేతికొచ్చే వరకు ఉండడం లేదని, చివరలో ధర తగ్గి వ్యాపారులు లాభపడే విధంగా ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు అనేక పోరాటాలు చేస్తే.. 2019 లో జరిగిన పోరాటాన్నిఆసరాగా తీసుకొని తాను గెలిస్తే పసుపు బోర్డు తీసుకువస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చి.... ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు అన్వేష్ రెడ్డి.


పసుపు బోర్డు కంటే మెరుగైన ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకువచ్చానని అరవింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని దానికి రూ. 2.73 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్తున్నారని అన్వేష్ రెడ్డి అన్నారు. నిజానికి పసుపు బోర్డు, స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం పనితీరు వేరని చెప్పారు. ఎంపీ అరవింద్ రాజకీయాల్లోకి రాకముందే డిప్యూటీ డైరెక్టర్ తో ప్రాంతీయ కార్యాలయం ఉందని అరవింద్ వచ్చాక డైరెక్టర్ ను నియమించడం జరిగిందని అన్వేష్ రెడ్డి అన్నారు.


స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మద్దతు ధర నిర్ణయించకుండా పసుపును ఉడికించే బాయిలర్ మిషన్లు, ఫాలిష్ చేసే మిషన్లకు సబ్సిడీ ఇవ్వడానికే ప్రాంతీయ కార్యాలయం పని చేయడం జరుగుతుందని అన్వేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ప్రాంతీయ కార్యాలయంతో రైతులు లాభాపడటం లేదని, రైతులు కోరుకునేది మద్దతు ధర పసుపు బోర్డు అని అన్వేష్ రెడ్డి అన్నారు. దేశంలో మనుషుల ప్రాణాలకు హాని చేసే పొగాకు బోర్డు ఉంది కానీ ఆరోగ్యానికి మేలు చేసే పసుపు బోర్డు మాత్రం లేదని అన్నారు. రైతులు పోరాటం చేస్తే దానిని ఆసరాగా తీసుకొని అరవింద్ గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నాడని  అన్వేష్ రెడ్డి విమర్శించారు. పసుపు బొర్డు ఏర్పాటు, పసుపునకు మద్దతు ధర అనేది కేంద్రం చేతిలోనే ఉందని.., అయినా మద్దతు ధర ఇవ్వకుండా ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చానని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని అరవింద్ పై అన్వేష్ రెడ్డి ఫైర్ అయ్యారు.


కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పసుపు రైతులను ఏకతాటిపైకి తెచ్చి పసుపు బోర్డు, పసుపునకు మద్దతు ధర ఉద్యమం చేస్తామని అన్వేష్ రెడ్డి అన్నారు. అరవింద్ కు మరొక అవకాశం ఇస్తున్నాం ఇప్పటికైనా పసుపు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే రైతులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు అన్వేష్ రెడ్డి.


Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం


Also Read: Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!