అంబులెన్స్ వెళ్తుంటే ఇతర వాహనాలు పక్కకు జరిగి మరీ దానికి దారి ఇవ్వాలనే కఠిన నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ ఇరుక్కుపోతే ఆ మార్గంలోని ఇతర వాహనాలు పక్కకు జరిగి మరీ దారిస్తారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఓ నిండు ప్రాణం కాపాడడం కోసం ఎవరైనా కాస్త కనికరం చూపిస్తారు. కానీ, ఇందుకు భిన్నమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి దగ్గర మంగళవారం జరిగింది. ఫలితంగా ఓ శిశువుకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది. 


తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశ, సరస్వతి దంపతులు. వీరికి మూడు నెలల కిందట కుమారుడు పుట్టాడు. అతనికి రేవంత్‌ అని పేరు పెట్టుకున్నారు. అయితే, అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా శిశువు పాలు తాగడం లేదు. 
దీంతో కొద్ది రోజుల నుంచి జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అక్కడ మెరుగైన ఫలితాలు కనిపించకపోవడంతో మంగళవారం పరీక్షలు చేసిన డాక్టర్లు రేవంత్‌ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోందని తేల్చారు. 


వెంటనే హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో అందుబాటులో ఉన్న కారును అద్దెకు తీసుకున్న తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్‌ కు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు ఆ అద్దె కారును ఆపారు. ఆ కారుకు గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల దాదాపు రూ.1,100 మేర చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే వదులుతామని పోలీసులు చెప్పారు. తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదని మల్లేశ, సరస్వతి వాపోయారు. కారు డ్రైవర్‌ సాయి వంగపల్లి సమీపంలో ఉన్న మీ-సేవ కేంద్రానికి వెళ్లి చలానా కట్టి వచ్చేందుకు దాదాపు అరగంట సమయం పట్టింది. 


ఇక హైదరాబాద్‌ బయలుదేరాక రేవంత్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే బాలుడు చనిపోయాడని తేల్చారు. పోలీసులు చలానాల పేరుతో ఆపడం వల్లే నిండు ప్రాణం పోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కానీ, పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.


ఏ కారులో తెచ్చారో మాకు తెలీదు - పోలీసులు
‘‘మంగళవారం (మే 31) ఉదయం మా పోలీసు సిబ్బంది నేషనల్ హైవేపై వాహన తనిఖీలు నిర్వహించాం. అందులో భాగంగానే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాం. ఆస్పత్రికి వెళ్తామని ఎవరూ మాకు చెప్పలేదు. శిశువును ఎవరు ఏ కారులో తెచ్చారో మాలో ఎవరికీ తెలియదు. అత్యవసర పరిస్థితి ఉందని మాలో ఎవరికైనా చెప్పి ఉంటే, ఆపద ఉంది కాబట్టి, వెంటనే వేరే కారులో పంపించి ఉండేవాళ్లం. ఇందులో మా సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు.’’ అని యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ సీఐ సైదులు వివరణ ఇచ్చారు.