Peddapalli Operation Chabutra : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆపరేషన్ చబుత్రా కార్యక్రమం చేపడుతున్నట్లు పెద్దపల్లి ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ గిరి ప్రసాద్, సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రా చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్ చేపట్టి రాత్రి సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న 45 మంది అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. రాత్రి 10:30 గం.ల తరువాత రోడ్లపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న వారిపై గతంలో కేసులు, నేరచరిత్ర ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ ఫింగర్ ప్రింట్స్ చెక్ డివైజ్ తో చెక్ చేశామన్నారు. అలాగే అర్ధరాత్రి గల్లీలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. మరోసారి అకారణంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ తో పాటు సీఐ రమేష్ బాబు, టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆపరేషన్ చబుత్రా
హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపతేర్‌లోని ఓ వీధిలో అర్ధరాత్రి పూట తిరుగుతున్న యువకులను నవ్వుతూ, కేకలు వేస్తూ కాలనీ వాసులను చాలాసేపు ఇబ్బంది పెట్టారు. అకస్మాత్తుగా ఒక పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది. పోలీసులు యువకులను వ్యాన్‌లోకి ఎక్కించారు. వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు వారిని కూర్చొపెట్టి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇదే పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చబుత్రా. అర్ధరాత్రుళ్లు రోడ్లపై అనవసరంగా తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసే యువకులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి గత కొన్ని సంవత్సరాల క్రితం ‘ఆపరేషన్ చబుత్రా’లో నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ చబుత్రాలో రాత్రిపూట వీధుల్లో తిరిగే వారిని పట్టుకునే కార్యక్రమం. వీధి చివర్లో ఖాళీగా కూర్చోవడం, తరచుగా స్థానిక నివాసితులకు ఇబ్బందిని సృష్టిస్తుంది.