Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైఎస్ వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వివేకా బావమరిదిపై ప్రైవేట్‌ కేసు నమోదైంది. వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య వీరిపై ప్రైవేట్‌ కేసు పెట్టారు. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ బృందం ఇవాళ పులివెందుల ఆర్ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. వివేకా పీఏ ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గతంలో పలుమార్లు సీబీఐ బృందం ఇనయతుల్లాను విచారించింది. 


విచారణ మళ్లీ ప్రారంభం 


వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం అయింది. పులివెందుల ఆర్ ​అండ్ ​బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా పీఏ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇనయతుల్లాను సీబీఐ బృందం విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు బెడ్ రూమ్, బాత్ రూమ్ లో పడి ఉన్న మృతదేహం ఫొటోలు, వీడియోలు ఇనయతుల్లానే తీశారు. అతని వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టడానికి అధికారులు సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరిని విచారించాలని శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై పులివెందుల కోర్టు విచారించింది. పిటిషనర్ పేర్కొన్న విధంగా రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరిపై సీబీఐ విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. 


శివశంకర్ రెడ్డికి బెయిల్ 


వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కడప కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కడప జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఒకరోజు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మే 26వ తేదీ ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. కడపలో శివశంకర్ రెడ్డి కుమారుడి ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 


దస్తగిరి సంచలన ఆరోపణలు 


వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతం చేసేందుకు పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా తొండూరు మండలానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి తరచూ తనతో, తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తన సోదరుడు మస్తాన్ ​తో గొడవపడ్డ గోపాల్, ఇష్టానుసారంగా బూతులు తిట్టడంతో పోలీస్ స్టేషన్ వెళ్లాలని అక్కడ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే తాను చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దానిని కారణంగా చూపించి పోలీసులు తనపై కేసు నమోదు చేశారని వాపోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఏం జరిగినా వైసీపీ నాయకులదే బాధ్యత అన్నారు.