Viral Video: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లావుగా ఉన్న ఓ కార్యకర్తను దీదీ అడిగిన ప్రశ్నలు అక్కడున్న వారినే కాకుండా నెటిజన్లను కూడా నవ్వించాయి.
ఇదీ జరిగింది
సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ కార్యకర్తలతో పురిలియాలో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో లావుగా ఉన్న ఓ వ్యక్తి వంతు వచ్చింది. అతను దీదీతో ఏదో విషయం చెబుతుండగా ఆమె మధ్యలో కలగజేసుకున్నారు.
మమత: బస్తా లాంటి నీ పొట్ట చూస్తుంటే ఏదో ఒక రోజు నువ్వు కుప్పకూలిపోతావ్ అనిపిస్తుంది? నీ ఆరోగ్యం బాగానే ఉందా?
కార్యకర్త: నాకు షుగర్, బీపీ లాంటివి ఏం లేవు మేడమ్.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాదు నేను రోజూ వర్కవుట్లు కూడా చేస్తాను.
మమత: నీకు కచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. నీ మధ్యప్రదేశ్ (పొట్ట) చాలా భారీగా ఉంది.
కార్యకర్త: నేను రోజూ ఉదయం పకోడీలు, బజ్జీలు తింటాను మేడమ్. అది చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ రోజూ ఎక్సర్సైజ్ చేస్తాను.
ఈ సమాధానం విని దీదీ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.
మమత: పొద్దు పొద్దున్నే పకోడీలు ఎందుకు తింటున్నావ్? అలా తింటే నీ పొట్ట ఎప్పటికీ కరగదు. నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నావో చెప్పు. నువ్వు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తావో చెప్పు?
కార్యకర్త: నేను రోజు ప్రాణాయామం చేస్తా. 1000 సార్లు శ్వాస పీల్చి వదులుతా.
మమత: అది అసాధ్యం. నేను నమ్మను. నువ్వు ఇప్పుడు 1000 సార్లు చేసి చూపిస్తే నీకు రూ.10వేలు ఇస్తా. నీకు ప్రాణాయామంలో శ్వాస ఎలా తీసుకోవాలో, ఎలా వదలాలో కూడా తెలియదు. అసలు నీ బరువు ఎంత?
కార్యకర్త: నా బరువు125 కిలోలు మేడమ్.
మమత: ఇంత బరువు ఉన్న నువ్వు వెంటనే పకోడీలు తినడం మానెయ్. వ్యాయామం మొదలుపెట్టు. అప్పుడే పొట్ట కరుగుతుంది. నెల రోజులు అన్నమే తిను. రాత్రిపూట తిన్న తర్వాత ఒక కిలోమీటర్ నడువు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఉండు. నువ్వు ఇలా చేస్తున్నావో లేదో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటా.
దీదీతో మాట్లాడిన సదరు టీఎంసీ కార్యకర్త.. ప్రస్తుతం జల్దా మేయర్‌గా ఉన్నారు. దీదీ సలహాను కచ్చితంగా పాటిస్తానని ఆయన చెప్పారు.
Also Read: Uttar Pradesh Road Accident: అంబులెన్స్- ట్రక్కు ఢీ- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Also Read: Indian Railways: ఎంత పని చేశావ్ సామీ- రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం- రైల్వేశాఖకు షాక్!