Jammu Kashmir News: జమ్ముకశ్మీర్‌ కుల్గాంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గోపాల్‌పొరాలోని ఓ స్కూల్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఓ టీచర్ మృతి చెందారు.










ఇదీ జరిగింది


గోపాల్‌పొరాలోని ఓ హైస్కూల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. సాంబా ప్రాంతానికి చెందిన ఓ మహిళా టీచర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.


ఈ ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాదులను త్వరలోనే గుర్తించి ఎన్‌కౌంటర్ చేస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.


వరుస దాడులు


జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బుద్గాం జిల్లాలోని చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ అనే వ్యక్తిని ఇటీవల ఉగ్రవాదులు కాల్చి చంపారు. రాహుల్ అక్కడ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్‌.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.


ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.




తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కశ్మీరీ పండిట్లు ఇటీవల పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ ఆందోళన మొదలైన కొన్ని రోజులకే నేడు కశ్మీరీ పండిట్‌ వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.