PMEGP: ఉద్యోగ కల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రూ.13,554.42 కోట్లతో ఈ పథకం కొనసాగించనున్నారు.
ఈ పథకం కింద ఐదేళ్లలో దాదాపు 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ వెల్లడించింది.
మార్పులు
15వ ఆర్థిక కమిషన్ సైకిల్ కింద 2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. వ్యవసాయేతర రంగాల్లో చిన్న తరహా సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు యువతకు ఈ పథకం కింద సాయం చేయనుంది కేంద్రం. ఈ పథకాన్ని కొనసాగించడంతో పాటు కొన్ని మార్పులు కూడా చేసింది కేంద్రం.
- తయారీ యూనిట్ల ప్రాజెక్ట్ కాస్ట్‌ను గరిష్ఠంగా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది.
- సర్వీస్ యూనిట్ల ప్రాజెక్ట్ కాస్ట్‌ను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.
PMEGPలో భాగంగా పంచాయతీ రాజ్ కిందకు వచ్చే ప్రదేశాలను ఇక గ్రామీణ ప్రాంతాల లెక్కలోకి పరిగణిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ల ప్రాంతాలను పట్టణాల పరిధిలోకి తీసుకువచ్చారు. అలానే రూరల్, అర్బన్ కేటగిరీ అనే భేదాలు లేకుండా అప్లికేషన్లు అన్నింటిని ప్రాసెస్ చేసేలా ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది కేంద్రం.
సబ్సిడీ
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి అత్యధిక సబ్సిడీ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు, ఎన్‌ఈఆర్, సరిహద్దు జిల్లాల అభ్యర్థులకు పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ కాస్ట్‌లో 25 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం సబ్సిడీ ఇస్తారు.
సాధారణ కేటగిరీ దరఖాస్తుదారులకు పట్టణ ప్రాంతాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీ ఉంది.
ఈ పథకం మొదలైన 2008-09 నుంచి ఇప్పటివరకు దాదాపు 7.8 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజర్లకు రూ. 19,995 కోట్ల సబ్సిడీ అందజేసింది కేంద్రం. దీని ద్వారా 64 లక్షల మందికిపైగా ఉద్యోగాలు వచ్చాయి.
ఈ పథకం కింద సాయం అందుకున్న వాటిలో 80 శాతం యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇందులో 50 శాతం వాటికి ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు చెందిన వారే ఓనర్లుగా ఉన్నారు.
Also Read: Jammu Kashmir News: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కుల్గాంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు