Indian Railways:  "నాది కానిది కోటి రూపాయలైనా నాకొద్దు- నాది అయినది ఒక్క రూపాయి కూడా వదలను" ఇది ఓ సినిమాలో డైలాగ్. అదేంటి సడెన్‌గా డైలాగ్ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఓ వ్యక్తి తన రూ.35 కోసం ఏకంగా ఐదేళ్లు పోరాటం చేశాడు. అది కూడా సాదాసీదా వ్యక్తులతో కాదు ఏకంగా రైల్వేశాఖతో. అవును.. మరి ఆ వ్యక్తి ఏం సాధించాడు తెలుసుకుందాం.


రూ.35 కోసం


రాజస్థాన్‌లోని కోటకు చెందిన సుజీత్‌ స్వామి అనే ఇంజనీర్‌ రూ.35 రిఫండ్‌ కోసం రైల్వే శాఖపై  ఐదేళ్లు పోరాటం చేశాడు. సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేసి చివరికి విజయం సాధించాడు. తనతో పాటు 3 లక్షల మంది రైల్వే ప్రయాణికులకూ ప్రయోజనం కలిగించాడు. వారందరికీ రైల్వే శాఖ రూ.2.43 కోట్లు రిఫండ్‌ చేసేందుకు అంగీకరించింది. 


ఇదీ జరిగింది


2017 ఏప్రిల్‌లో సుజీత్ రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అదే ఏడాది జూలై 2న కోట నుంచి దిల్లీ వెళ్లేందుకు రిజర్వ్‌ చేశారు. అయితే అంతకుముందు రోజు అంటే జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన టికెట్‌(రూ.765)ను రద్దు చేసుకున్నారు. రైల్వే శాఖ క్లరికల్‌ ఛార్జీ కింద రూ.65, సేవా పన్ను కింద రూ.35 మినహాయించుకుని రూ.665 రిఫండ్‌ చేసింది.


తాను జీఎస్టీ రాకముందు టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నానని, అప్పుడు సేవా పన్ను లేనందున రూ.35 రిఫండ్‌ చేయాలని కోరుతూ సుజీత్‌ స్వామి పోరాటం ప్రారంభించారు. సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేయడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. రిఫండ్‌ చేయాలని కోరుతూ ప్రధాని, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జీఎస్టీ కౌన్సిల్‌కు వరుసగా ట్వీట్లు చేశారు.


రూ.2 కోసం


అయితే ఎట్టకేలకు 2019 మే1న ఆయన పోరాటు ఫలించింది. కానీ రూ. 35 చెల్లించాల్సిన రైల్వేశాఖ ఆయన బ్యాంకు ఖాతాలో రూ.33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది. సుజీత్ స్వామి చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. స్వామి చేసిన పనికి అధికారులు మాత్రం అవాక్క‌య్యారు. 


Also Read: PMEGP: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం పొడిగింపు- 40 లక్షల మందికి ఉద్యోగాలు!


Also Read: Jammu Kashmir News: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కుల్గాంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు