Light to moderate rain In AP And Telangana: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఈ ఏడాది గత ఏడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీర్ఘ కాల సగటులో 99 శాతం మేర వర్షాలు పడుతాయని గతంలో ప్రకటించిన ఐఎండీ ఆ ప్రకటనను సవరించింది. దీర్ఘకాల సగటు కంటే 103 శాతం అధికంగా వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని మరికొన్ని భాగాలు.. మొత్తం ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్, తూర్పు బంగాళాకాతంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు మీదుగా ఈ రుతుపవనాలు విస్తరించాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
ఈరోజు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయి. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ , నారాయణపేట జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదు.
Also Read: Southwest Monsoon : కర్నాటకను తాకిన రుతుపవనాలు- ఈ ఏడాది వర్షాలు బాదుడే బాదుడు