భారత్ వాతావరణ శాఖ చల్లని వార్తను చెప్పింది. గతంలో ఇచ్చిన వర్షపాత అంచనాలు సవరిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈసారి అంచనాలు మించి వర్షాలు పడతాయని వెల్లడించింది ఐఎండీ. దీర్ఘ కాల సగటులో 99 శాతం మేరే వర్షాలు పడుతాయని గతంలో ప్రకటించిన ఐఎండీ ఆ ప్రకటనను సవరించింది.
భారత్ వాతావరణ శాఖ ప్రస్తుతం వేసిన అంచనాల ప్రకారం గతంలో కంటే ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీర్ఘకాల సగటు కంటే 103 శాతం అధికంగా వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. దేశంలోని చాలా ప్రాంతాల్లో మెరుగైన వర్షాలు పడతాయంటోంది. ఒక్క ఈశాన్య ప్రాంతంలో మాత్రం వర్షాలు తగ్గువగానే ఉంటాయని అభిప్రాయ పడింది.
ఇప్పటికే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని మే29న ఐఎండీ ప్రకటించింది. ముందుగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ భావించినప్పటికీ మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళలో ప్రవేశించాయిని పేర్కొంది. భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ విషయాన్ని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27వ తేదీన కేరళకు చేరుకునే అవకాశం ఉందని ఓ దశలో ఐఎండీ అంచనా వేసింది.
ప్రస్తుతానికి రుతుపనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. కేరళను పూర్తిగా చుట్టేసిన నైరుతి రుతుపవనాలు... మధ్య అరేబియా సముద్రం సహా కర్నాటక, తమిళనాడు ప్రాంతాలకు విస్తరించినట్టు ప్రకటించింది. బంగాళాఖాతం ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటించింది.