Yadadri News: సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి దేశంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన అన్విత పడమటి పర్వతారోహణలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి రైతు. తల్లి చంద్రకళ అంగన్వాడీ స్కూల్ లో పని చేస్తున్నారు. ఏడు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏడు శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో అన్విత ముందుకెళ్తోంది. అంటార్కిటికాలో ఈ ఘనత ఆమె నాలుగో విజయంగా చెప్పుకోవాలి. మౌంట్ మనుస్లూ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మూడు నెలల తర్వాత అన్విత పడమటి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది.


డిసెంబర్ 17వ తేదీన అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం సముద్ర మట్టానికి 4 వేల 892 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్ పర్వతాన్నిఅన్విత అధిరోహించి మరో రికార్డును నెలకొల్పింది. డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ నుంచి చిలీలోని పుంటా అరేనాస్ కు బయలుదేరిన ట్రాన్స్ సెండ్ అడ్వెంచర్స్ ఇంటియాతో అంటార్కిటికాలోని అంతర్జాతీయ యాత్ర బృందంలో అన్విత కూడా ఉంది. డాక్యుమెంటేషన్, ఇతర రాతపని పూర్తి చేసిన తర్వాత ఆమె డిసెంబర్ 7వ తేదీన అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ కు వెళ్లింది. అయితే ఈ పర్వతాన్ని అధిరోహించడం అంత తేలికైన విషయం ఏం కాదు. తాను జట్టుతో కలిసి ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశానని అన్విత తెలిపింది. 


గతంలోని పర్వతారోహణ అనుభవం కూడా తనకు చాలా ఉపయోగపడిందని, 7 శిఖరాలను అధిరోహించాలన్నా తన లక్ష్యంలో ఇది 4వ శిఖరంగా అన్విత తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు అన్విత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, విపరీతమైన గాలులతో కూడిన పరిస్థితులను ఎదుర్కుంది. అంతటి కఠినమైన అంటార్కిటికా వాతావరణానికి అలవాటు పడింది. చివరకు డిసెంబర్ 16వ తేదీన ఆమె శిఖరారోహణకు ప్రయత్నించింది. 


"ఈరోజు చాలా గాలులు వచ్చాయి. దాదాపు మైనస్ 30 డిగ్రీల చలిలో శిఖరాన్ని ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది. నా చేతులన్నీ చల్లగా అయ్యాయి. కనీసం నేను టెంట్ కూడా వేయలేకపోయాను. చాలా కష్టపడి అందరం కలిసి టెంట్ వేశాం. టెంట్ లోపల దాదాపు మైనస్ 35 డిగ్రీల చలి ఉంది. డిసెంబర్ 16వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో శిఖరం అధిరోహించడానికి బయలు దేరితే రాత్రి 9 గంటలకు పైకి చేరుకున్నాం. 4892 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ శిఖరంపై భారతీయ జెండాను ఉంచి.. దాదాపు 20 నిమిషాల పాటు చాలా హ్యాపీగా గడిపాను. పైన ఉన్న పర్వతం అచ్చం పిరమిడ్ లా ఉంటుంది" అని అన్విత వెల్లడించింది.


అన్విత కోచ్, మెంటర్ శేఖర్ బాబు బాచినేపల్లి మాట్లాడుతూ... విన్సన్ పర్వతాన్ని ఎక్కడం టెక్నికల్ గా అంత కష్టం కాదు కానీ పర్వత ప్రదేశం రిమోట్ గా ఉంటుందని అన్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు  మారుతూ ఉంటాయని తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే గాలులు ఎక్కువ, తక్కువ అవుతుంటాయని, అక్కడికి వెళ్లే వాళ్లకు ఫిట్ నెస్ చాలా అవసరం అని చెప్పారు.