Yadadri Temple Income: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. గత 20 రోజుల వ్యవధిలోనే రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700 లు హుండీ ఆదాయం సమకూరింది. బంగారం 167 గ్రాములు రాగా.. 2 కిలోల 600 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక అమెరికా డాలర్లు 1194, యూఏఈ దిర్హామ్స్ 140, ఆస్ట్రేలియా డాలర్స్ 150, ఇంగ్లండ్ పౌండ్స్ 30, కెనడా డాలర్స్ 45, ఒమాన్ బైసా 10,500, న్యూజిలాండ్ డాలర్స్ 45, సింగపూర్ 74 డాలర్స్, మలేషియా రింగ్గిట్స్ 69, సౌదీ రియల్స్ 27 వచ్చినట్లు వివరించారు.
నవంబర్ లో ఒక్కరోజే 1.09 కోట్ల హుండీ ఆదాయం
నవంబర్ 13వ తేదీ ఆదివారం ఒక్క రోజే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ. 1.09 కోట్ల ఆదాయం నెలకొనగా.. ఆలయ చరిత్రలో తొలిసారి కోటి రూపాయలు దాటిందని ఆలయ అధికారులు చెప్పారు.
ఇటీవలే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు, రాష్ట్రపతి ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అయితే యాదాద్రిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం. శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి సారథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజు హైదరాబాద్‌లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించారు.