నేడు ఉస్మానియూ యూనివర్శిటీలో గ్లోబల్ అలుమ్నీ మీట్- 2023
వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో గ్లోబల్ అలుమ్నీ మీట్- 2023 నేడు, రేపు జరగనుంది. ఉస్మానియూ యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్థులు అంతా ఒక చోట చేరనున్నారు. యూవిర్శిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మాజీ వీసీలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కీలక భూమిక పోషిస్తున్న పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కూడా హాజరు కానున్నారు.
నేడు సావిత్ర భాయ్ పూలే 191 జయంతి
దేశ తొలి మహిళా ఉపాద్యాయురాలు, ప్రముఖ సంఘసంస్కర్త, రచయిత్రి సావిత్ర భాయ్ పూలే 191 జయంతి ఈరోజు. 1831 జనవరి మూడో తేదీన మహారాష్ట్రాలోని సతారా జిల్లా నయిగాం గ్రామంలో రైతు కుటుంబంలో ఆమె జన్మించారు. పీడిత ప్రజలు, ముఖ్యంగా మహిళల విద్యకోసం ఎనలేని సేవ చేశారు. ఆమె పుట్టిన రోజును ప్రతి ఏడాది మహిళ టీచర్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నేడు గోదావరి బోర్డు సమావేశం.
గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం నేడు జరుగనున్నది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండికుంటవాగు ఎత్తిపోతల పథకాల అనుమతుల ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్రం కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, బోర్డు నిర్వహణ, నిధులు, ఉద్యోగులు, సీడ్ మనీ, వసతి తదితర అంశాలపై సైతం చర్చ జరుగనున్నది.
కడెం-గూడెం ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. కడెం ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యత ఉందని, గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదంటూ గత ఆగస్టులో బోర్డుకు ఏపీ లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, దీంతో ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇవాళ భేటీలో వాడివాడీగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. మరో వైపు గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటి వరకు నిర్ణయించకపోవడంతో రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గోదావరిలో 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3216 టీఎంసీల జలాల లభ్యత ఉందని, ఏపీకి 1360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అధ్యయనంలో తేలిందని ఏపీ వాదిస్తున్నది. తెలంగాణకు 1480 టీఎంసీల లభ్యత ఉందని, ఏపీకి 1486.55 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ వాదిస్తున్నది. ఈ క్రమంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ సంస్థతో అధ్యయనం చేయించాలని బోర్డు ప్రతిపాదిస్తుండగా.. ఈ అంశంపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నియామక పరీక్ష
ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలోని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ నియామక పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నేడు నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ ఆధారిత ద్వారా పరీక్షను నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 13,954 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. పేపర్1..ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 9.15 వరకు అనుమతిస్తారని పేర్కొంది. మధ్యాహ్నం సెషన్‌కు 1.15 నుంచి 1.45 లోనికి అనుమతివ్వనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఐడీ కార్డు తీసుకెళ్లాలని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించబోమని తెలిపింది.