‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, వైఎస్సార్‌ అభిమానులకు అండగా ఉండేందుకు మా కుటుంబం సిద్దంగా ఉంది.. అందుకే ఇక్కడ వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు అండగా ఉంటున్నారు. అలాగే తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ పోరాటం చేస్తుంది. రెండు పార్టీలలో సభ్యత్వం ఉండకూడదనే కారణంగా కూతురు షర్మిలకు సహాయం చేసేందుకు రాజీనామా చేస్తున్నా..’ అని విజయమ్మ వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గతంలో విజయమ్మ రాజీనామా చేశారనే ఓ లేఖ వార్తలోకి వచ్చింది. అయితే అది తను రాసిన లేఖ కాదని చెబుతూనే తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం గమనార్హం. అయితే విజయమ్మ రాజీనామా చేయడం, అదీ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలోనే ప్రకటించడం వెనుక వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో చేరడం వ్యూహాత్మాకమా..? లేక అక్కడ్నుంచి పూర్తిగా విడిపోయారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


తెలంగాణలో జగనన్న వదిలిన భాణమేనా..? 
తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్లమెంట్‌ చర్చలో అప్పుడు ఎంపీగా ఉన్న వై.ఎస్‌.జగన్‌ సమైఖ్యాంద్రకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటైన అప్పటి వరకు వైఎస్సార్‌ అభిమానులుగా ఉన్న ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. విభజన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమైఖ్యాంద్రకు పూర్తి మద్దతు ఇచ్చిన వై.ఎస్‌.జగన్‌ తెలంగాణలో వస్తే ఇక్కడ అంతగా ప్రభావం చూపే అవకాశం లేదనే చెప్పవచ్చు. మరోవైపు ఆంధ్రాలో బలమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీకి ఆంధ్రాలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే నేరుగా తాను తెలంగాణ రాజకీయాలోకి రాకుండా వై.ఎస్‌.షర్మిలను తెలంగాణకు పంపారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


గతంలోనే ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా వైఎస్సార్‌ అభిమానుల అండగా రాజకీయం మొదలవుతుందనే వార్తలు ప్రచారం సాగాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ వై.ఎస్‌.షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) స్థాపించారు. అయితే షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత విజయమ్మ ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో గొడవల కారణంగానే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు పూర్తిస్థాయి తెలంగాణ రాజకీయాలోకి వచ్చేందుకు, షర్మిలకు అండగా నిలబడేందుకు విజయమ్మ నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పకనే చెప్పడం చూస్తే తెలంగాణలో జగనన్న వదిలిన బాణం షర్మిల అనే విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వస్తోంది. 


ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ మధ్య పూర్తిస్థాయి సఖ్యత కొనసాగుతుందనే ఇద్దరు నేతలు ప్రత్యక్షంగానే చూపించారు. జగన్‌ ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ నేరుగా వెళ్లడం, జగన్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి కేసీఆర్‌ ఇంటికి రావడం చూస్తే ఇద్దరి మద్య ఉన్న అనుబంధం ఇట్టే అర్థమవుతుంది. జగన్‌ నేరుగా తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ కోడలు పేరుతో షర్మిలను ఇక్కడి రాజకీయాల్లోకి పంపినట్లుగా రాష్ట్రంలో టాక్ ఉంది. 


2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలవడం చూస్తే ఇక్కడ రాజశేఖర్‌రెడ్డికి ఉన్న అభిమానం అర్థమవుతుంది. దీంతోపాటు హైదరాబాద్‌తోపాటు గోదావరి పరివాహక జిల్లాలో ఆంధ్రా నుంచి వచ్చిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. మరోవైపు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలలో వారి ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. ఏపీ నుంచి వచ్చిన వారితోపాటు వైఎస్సార్‌ అభిమానులను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాజకీయాల్లో తన మార్కు చూపించే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి.  ఏది ఏమైనప్పటికీ విజయమ్మ రాజీనామా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది.