Southwest Monsoon: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలోనూ భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాంలోనూ నేటి నుంచి   నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలోని కర్నూలు జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల ఇంకా చినుకు కూడా పడలేదు. దీంతో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.


తెలంగాణలో భారీ వర్షాలు.. 
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణం కన్నా 45 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మణికొండ​, గచ్చిబౌలి, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 





కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని, ఆ ప్రాంతాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 






హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
 Also Read: Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, రోడ్లన్నీ జలమయం


Also Read: Gold Rate Today 9th July 2022: గుడ్‌న్యూస్, జూలైలో కనిష్టానికి బంగారం ధర, రూ.3 వేలు దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ