Guinness Records: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అనేది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఎంతో పట్టుదల, మరెంతో కృషి ఉంటేగానీ అందులో చోటు దక్కించుకోలేరు. ఏదైనా పనిలో ఎవరూ చేయలేని పనిని చేసి చూపితేనే అందులో చోటు దక్కుతుంది. అలాంటి ఓ పని చేసి గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది నల్గొండ జిల్లాకు చెందిన యువతి. ఏకంగా లక్ష పేజీల పుస్తకానికి ఎడిటర్ గా వ్యవహరించడమే కాకుండా.. ఆ పుస్తకానికి ఏకంగా 200 ఆర్టికల్స్ రాసి అందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకానికి ఆమె చేసిన కృషిని గుర్తించిన గిన్నిస్ రికార్డు ప్రతినిధులు.. ఆమెకు అవార్డు అందించారు. ఆమె ఎవరు.. ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకం పేరు ఏంటి.. అందులో ఎన్ని పేజీలు ఉంటాయి.. ఆ మహిళా రచయిత పేరు ఏంటి అనే తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఆ మహిళా రచయిత పేరు జుహీదా బేగం. నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు జుహీదా బేగం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టినప్పటికీ జుహీదా బేగం చదువును ఆమె కానీ, తన తల్లిదండ్రులు గానీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా.. జుహీదా బేగం చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. తోటి విద్యార్థులతో పోటీ పడి చదివేది. అలా నల్గొండలోనే డిగ్రీ పూర్తి చేసింది జుహీదా బేగం. పీజీ కూడా చేసిన తర్వాత జుహీదా.. హైదరాబాద్ కు వచ్చింది. హయత్ నగర్ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా చేరింది. ప్రస్తుతం ఒక వైపు లెక్చరర్ గా చేస్తూనే.. రాచకొండ ఎన్ఎస్ఎస్ పీవో గైడ్ గా కూడా విధులు నిర్వర్తిస్తోంది. 


ఏదైనా కొత్తగా చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది జుహీదా బేగం. కొత్తదనం కోసం పరితపించే తన మనస్తత్వమే ఇప్పుడు ఆమెకు గిన్నిస్ రికార్డ్స్ లో చోటు కల్పించేలా చేసింది. తమిళనాడులోని ఈఎస్ఎన్ పబ్లికేషన్స్ 100100 పేజీలతో ఓ బుక్ ప్రచురించబోతున్నట్లు తెలుసుకుంది. షీ ఫర్ హర్‌సెల్ఫ్‌ అనే పేరు గల ఆ పుస్తకంలో తాను కూడా పాలు పంచుకోవాలని అనుకుంది. అలా ఆ పుస్తకానికి ఏకంగా 200 ఆర్టికల్స్ రాసి అందించింది. దాంతో పాటు ఆ పుస్తకానికి ఎడిటర్ గా కూడా వ్యవహరించింది జుహీదా బేగం. లక్ష పేజీలు గల ఈ పుస్తకం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించింది జుహీదా బేగం. 


Also Read: Teachers Transfers: టీచర్ల బదిలీకి విడుదలైన షెడ్యూల్, సెప్టెంబర్ 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు


అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకంలో భాగస్వామి అయిన మహిళా రచయితగా జుహీదా బేగం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గత నెల 28వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో జుహీదా బేగంకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక పత్రంతో పాటు ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందించారు. గిన్నిస్ రికార్డ్స్ తో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని జుహీదా బేగం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రికార్డును తన తండ్రి దస్తగిరికి అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.