ఈ నెల 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, పిటిషన్‌దారులకు ఆదేశించింది. అనంతరం విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయించింది. దీనిపై యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. యాదవ సంఘాల అభ్యంతరంతో వివాదం తీవ్ర తరమైంది. హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. గతంలోనే ఈ పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు విగ్రహం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.
వివాదంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో నిర్వాహకులు కాస్త వెనక్కి తగ్గి విగ్రహంలో చాలా మార్పులు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగించారు. పింఛం కూడా తీసేశారు. ఇదే విషయాన్ని కోర్టుకి కూడా తెలియజేశారు.
బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషన్ దారులు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటును ఆపాలని ఆదేశించింది. దీని కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేస్తున్నట్టు చెప్పింది.
ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై’ దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని రెడీ చేయించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు ‘జూనియర్ ఎన్టీఆర్’ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం 14 పిటిషన్స్ దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ JAc, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం వంటి సంస్థలు పిటిషన్లు వేశాయి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్‌ను మహానటుడుగా, అభిమాన నాయకునిగా అభిమానించినా భగవంతుని స్థాయిలో పోల్చరాదని వారంటున్నారు. యాదవ, కమ్మ సంఘాల వారి ఓట్ల కోసమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సినీ నటి కరాటే కళ్యాణి కూడా ఈ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ ఆందోళన కూడా నిర్వహించారు.. జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు.. ప్రభుత్వ స్థలం లో ప్రైవేట్ కార్యక్రమం కు ఎలా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. ఆమె చేసిన కామెంట్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వివరణ కోరింది. వివరణ ఇవ్వకపోవడంతో ఆమెను సంఘం నుంచి బహిష్కరించింది.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ రి-రిలీజ్ - ఆ విషయంలో ఫీలవుతున్న ఫ్యాన్స్?
Also Read: ఎన్టీఆర్ బయోపిక్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఆ నందమూరి హీరోతో తీస్తా: దర్శకుడు తేజ