భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగే కళ్యాణ మహోత్సవాలు, పట్టాభిషేకం కార్యక్రమానికి ప్రత్యేక సంస్కృతి ఉంది. సీతారామ కళ్యాణానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు. రాములోరి పట్టాభిషేకానికి గవర్నర్‌ హాజరవుతారు. ఇది ప్రతి ఏడా జరిగే తంతు. ఈ ఇద్దరి పర్యటన కోసం రెండు రోజుల పాటు హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌ భద్రాచలంకు వచ్చి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌ సీతారామ కళ్యాణానికి హాజరుకాలేదు. అయితే ఈ ఏడాది గత సంస్కృతికి బిన్నంగా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళ్‌సై రైలులో భద్రాచలం రావడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
ప్రభుత్వం.. గవర్నర్‌ మధ్య గ్యాప్‌ మరింత పెరిగిందా?
గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మద్య గ్యాప్‌ పెరిగినట్లు వార్తలు వినిపించడంతో ఏకంగా గవర్నర్‌ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయగా కొందరు మంత్రులు సైతం అంతే దీటుగా ప్రతి విమర్శలు చేశారు. ఈ పంచాయతీ కాస్తా డిల్లీ వరకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను అమలు చేయడం లేదని ప్రధాని నరేంద్రమోడికి, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిల్లీ నుంచి వచ్చిన గవర్నర్‌ తమిళ్‌ సై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని మీడియా సాక్షిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మద్య గ్యాప్‌ మరింతగా పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 
భద్రాచలం పర్యటనలో మరింత స్పష్టం..
ప్రతి ఏడాది పట్టాబిషేకం మహోత్సవానికి గవర్నర్‌ అతిధిగా విచ్చేస్తారు. గవర్నర్‌ పర్యటనకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ల మద్య గ్యాప్‌ పెరిగిన నేపథ్యంలో ఆమె భద్రాచలం పర్యటన కోసం రైలులో రావడం చర్చానీయాంశంగా మారింది. గవర్నర్‌ పర్యటన కోసం ప్రభుత్వం హెలికాప్టర్‌ ఏర్పాటు చేయకపోవడం వల్లే గవర్నర్‌ రైలు మార్గం ద్వారా భద్రాచలానికి వచ్చారా..? లేక పోతే ప్రభుత్వం ఇచ్చే ఆతిద్యాన్ని తిరస్కరించేలా రైలు మార్గంలో వచ్చారా..? అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా భద్రాచలం కేంద్రంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మద్య విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాములోరి సాక్షిగా ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఉన్న గ్యాప్‌ ఈ టూర్‌ ఏర్పాట్ల ద్వారా మరింత బహిర్గతం అవుతాయా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఏది ఏమైనా దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామ చంద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇప్పుడు రాజకీయంగా మారడం గమనార్హం.