Prisoner Escape from police custody From Khammam Jail: అతను ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతంలోనే అతడిపై పలు చోరీ కేసులు నమోదయ్యాయి. బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో కొన్ని రోజుల నుంచి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే తల్లి తల్లి సహకారంతో పినాయిల్‌ తాగి పోలీసుల కళ్లుకప్పి జైలు నుంచి పారిపోయాడు. సినిమా సీన్ తరహాలో జరిగిన ఈ మాస్టర్‌ ప్లాన్‌ పోలీసులను కలవరపెడుతుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం సంచలనంగా మారింది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. 
ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రాపల్లి మండలానికి చెందిన బోలెం విజయకృష్ణ గతంలో పలు చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల తన పిన్ని బోలెం లక్ష్మీ ఇంటికి ఆధార్‌ కార్డు కోసం వెళ్లాడు. అయితే అక్కడే లక్ష్మీ కూతురు ఓ డబ్బా తీసుకొచ్చింది. ఆ డబ్బాలో బంగారు నగ ఉండటాన్ని గమనించిన విజయకృష్ణ దానిని కాజేసేందుకు ప్లాన్‌ వేశాడు. ఆ తర్వాత లక్ష్మీ ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గమనించి ఆ బంగారు నగను చోరీ చేశాడు. తమ ఇంట్లో ఉన్న బంగారు నగ దొంగతనానికి గురికావడంతో ఆందోళన చెందిన లక్ష్మీ కుటుంబ సభ్యులు వైరా ఏసీపీ నెహామెహ్రాను ఆశ్రయించారు. ఏసీపీ ఆదేశాల మేరకు బోనకల్‌ ఎస్సై తేజావత్‌ కవిత విజయకృష్ణను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తనపై నేరం రుజువు అవుతుందని ఆందోళనకు గురైన నిందితుడు విజయకృష్ణ ఎలాగైనా తప్పించుకోవాలని పక్కా ప్లాన్‌ వేసుకున్నాడు. 
తల్లి సాయంతో పినాయిల్‌ తాగి..
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న విజయకృష్ణను చూసేందుకు అతని తల్లి రమణ వచ్చింది. ఎవరు చూడకుండా మద్యం బాటిల్‌లో పినాయిల్‌ పోసి ఇచ్చింది. ఇది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విజయకృష్ణను 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విజయకృష్ణ తన ప్లాన్ ప్రకారం మూత్ర విసర్జన పేరుతో పోలీసులకు చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎంచక్కా అక్కడి నుంచి పరారయ్యాడు. బయటకు వెళ్లిన విజయకృష్ణ ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడ ఉన్న పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ప్రస్తుతం విజయకృష్ణ ఆచూకి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.  ఈ విషయంపై బోనకల్‌ ఎస్సై తేజావత్‌ కవితను వివరణ కోరగా చోరీ కేసులో దోషి అని తేలుతుందని భావించి విజయకృష్ణ పరారయ్యాడని తెలిపారు. దొంగతనం కేసులో నిందితుడు సినిమా స్క్రిప్ట్‌ రేంజ్‌లో పినాయిల్‌ తాగి పోలీసుల చెర నుంచి తప్పించుకోవడం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. 
Also Read: Jadcherla Police : రోడ్డు పక్క కారుడ్రైవర్‌ డెడ్‌బాడీ- విచారిస్తే పోలీసుల మైండ్‌ బ్లాక్‌ అయ్యే ట్విస్ట్‌ 


Also Read: Jagtial News: మళ్లీ పాగా వేసేందుకు యత్నాలు - జనశక్తి సభ్యులను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు