Janashakti Central Committee members arrested in Jagtial district: ఉత్తర తెలంగాణలో పాగా వేయడానికి జనశక్తి మళ్లీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ కేంద్ర స్థాయి నాయకులు కొత్త రిక్రూట్ మెంట్ తో పాటు భారీ ఎత్తున ఆయుధాలను సమీకరించుకొనే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా కోరుట్ల శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపై చేపట్టిన వెహికల్ చెకింగ్ లో ముగ్గురు జనశక్తి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్తోలు, రెండు రివాల్వర్లు, మూడు తపంచాలతో పాటు 299 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


జనశక్తి సీనియర్ నాయకుడు కూర రాజన్న నాయకత్వంలో వీరంతా పనిచేసేందుకు సిద్ధమై ఆయుధాలను వివిధ ప్రాంతాల ద్వారా తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందులో వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి గ్రామానికి చెందిన జనశక్తి కేంద్ర కమిటీ సభ్యులు నూక సురేందర్ అలియాస్ వంజల సురేందర్ @విశ్వనాధ్ @పి ఆర్పి రెడ్డి (55) తో బాటు జగిత్యాల పట్టణానికి చెందిన చిట్టి రాజేశ్వర్ అనే కూర రాజన్న కమిటీ సభ్యుడు అరెస్ట్ అయ్యాడు. ఇక సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లి గ్రామానికి చెందిన నగునూర్ రవీందర్‌ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు .


ఎవరీ సురేందర్ ?
కూర రాజన్నతో సన్నిహిత సంబంధాలు గల సురేందర్‌ది మేడిపల్లి మండలం గోవిందారం గ్రామం. 1997 సంవత్సరం నుండి జనశక్తిలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. 2011 వరకు అండర్ గ్రౌండ్ లో ఉంటూ పనిచేస్తున్న ఇతను 2013లో సుద్దాల గ్రామం వద్ద ప్రభాకర్ రావు అనే వ్యక్తిని హత్య చేసి తప్పించుకొని ముంబైకి పారిపోయాడు. తిరిగి కొన్ని నెలలకు హైదరాబాద్ వచ్చి సెటిలై పలు ప్రాంతాల్లో  మారుపేరుతో పని చేసినట్లు తెలిపారు. పేరు మార్చుకున్న సురేందర్ సంధ్యా నగర్, బండ్లగూడ ఏరియాల్లో పలువురితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు  తెలుస్తోంది. 


మళ్లీ పెరిగిన కార్యకలాపాలు..
దాదాపు 5 నెలల కిందట ఒక నాటు తపంచా కొన్ని బుల్లెట్లను నగునూరి రవీందర్ అనే వ్యక్తికి మరో సింగిల్ బారెల్ గన్ ని గున్నాల లక్ష్మయ్య కు ఇచ్చి చెట్టి రాజేశ్వర్ ద్వారా రాజన్నను రహస్యంగా కలుసుకున్నారు. అక్కడ ఆరు షార్ట్ వెపన్స్ ని వారికి అందించారు కూర రాజన్న. తిరిగి జనశక్తిని ఇక్కడ బలపరిచేలా యువకులు కొందరిని వారి వైపు మళ్లించుకుని వారికి శిక్షణ  ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ప్లాన్స్ మొదలుపెట్టారు. తిరిగి సిరిసిల్లలోని అటవీప్రాంతంలో మీటింగ్ కూడా నిర్వహించినట్లు ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించారు. తిరిగి వీరంతా కలిసి మార్చి 23న వేములవాడ కి చెందిన రాజ మల్లయ్య అనే వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేశారు. అయితే పోలీసులకు వీరిపై సమాచారం రావడంతో అందులో ఒకరు అరెస్ట్ కాగా మిగతా వారు పారిపోయారు. మళ్ళీ వీరి జాడ కనుక్కునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, చివరకు కొందరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.