మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లికి చెందిన శ్రీశైలం హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితమే సంగీతతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్బీనగర్‌లో ఉంటున్నారు.
అత్యవసరం అని చెప్పి తమ కాలనీలో ఉన్న వ్యక్తి వద్ద సంగీత అప్పు చేసింది. చేబదులుగా 50 వేలు తీసుకుంది. ఈ అప్పే వాళ్ల కొంప ముంచింది. అవసరం కొద్ది అప్పు ఇచ్చిన విక్రం... సంగీతను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజులు గుట్టుగా సాగిందీ వ్యవహారం.
సంగీత, విక్రం రిలేషన్ గురించి తెలుసుకున్న శ్రీశైలం భార్యను హెచ్చరించాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సంగీత తన ప్రవర్తన మార్చుకోలేదు.
భార్య సంగీత ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి చాలా ప్రయత్నాలు చేశాడు. నివాస ప్రాంతాలను కూడా మార్చాడు. అయినా సంగీత మారలేదు. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో సొంతూరు బూర్గుపల్లి చేరుకున్నారు.
సొంతూరు వెళ్లినప్పటికీ సంగీత తన సంబంధాన్ని కొనసాగించింది. వాళ్లసెల్ ఫోన్ వీళ్ల సెల్ ఫోన్ నుంచి విక్రంతో మాట్లాడుతుండేది. ఇది మరింత కష్టంగా మారిందని భావించిన విక్రం, సంగీత... భర్త శ్రీశైలం అడ్డుతొలగించుకోవాలని ప్లాన్చేశారు.
శ్రీశైలం మర్డర్‌కు ప్లాన్ చేసిన విక్రమ్ ముందుగా తన స్నేహితుడు రాజును సంగీత ఇంటికి పంపించాడు. అతన్ని తన దూరపు బంధువుగా శ్రీశైలానికి పరిచయం చేసింది సంగీత. ఇది నమ్మిన రాజును ఇంట్లో ఉండేందుకు అంగీకరించాడు. అదే అతని ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుందని ఆలోచించుకోలేకపోయాడు.
కొన్ని నెలలు గడిచిన తర్వాత శ్రీశైలం మర్డర్ ప్లాన్ అమలు చేయాలని అనుకున్నారు. స్పాట్‌కు రెడీ చేశారు. మార్చి 31న విక్రం కొత్తగా కొన్న బైక్, స్పెషల్‌గా తయారు చేసిన రాడ్, కారం, మద్యం పట్టుకొని బూర్గుపల్లి బయల్దేరాడు.
కిష్టంపల్లికి చేరుకున్నాక అక్కడే ఓ దుకాణంలో వాటర్ బాటిల్ కొన్నాడు విక్రం. ఆ దుకాణం యజమాని సెల్‌ఫోన్ తీసుకొని రాజుకు ఫోన్ చేశాడు.
అల్లుడు శ్రీశైలానికి ఇవ్వాలని చెప్పి సంగీత అమ్మ డబ్బులు పంపించిందని తీసుకురావాలని చెప్పి రాజుకు చెప్పాడు విక్రం. అది వర్కౌట్ అయింది. రాజు మాటలు నమ్మి కిష్టంపల్లి వచ్చేందుకు అంగీకరించాడు శ్రీశైలం. రాజు, శ్రీశైలం ఇద్దరూ బైక్‌లో బయల్దేరి కిష్టం పల్లి వచ్చారు.
కిష్టంపల్లి వచ్చాక రాజు, శ్రీశైలం ఇద్దరు మద్యం తాగారు. ఇంతలో విక్రం ఎంటర్ అయ్యాడు. అతనితో తెచ్చుకున్న కారాన్ని శ్రీశైలం కళ్లల్లో కొట్టాడు. రాడ్‌తో శ్రీశైలం తలపై గట్టిగా కొట్టాడు. అంతే శ్రీశైలం కిందపడిపోయాడు. అతడు చనిపోయాడని కన్ఫామ్ చేసుకున్నాక విక్రం, రాజు ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.
రోడ్డుపక్కన డెడ్‌బాడీ పడి ఉండటం తెల్లాసరికి సంచలనంగా మారింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు అది శ్రీశైలం మృతదేహంగా గుర్తించారు. అతని చెల్లెల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు.
దర్యాప్తు చేస్తున్న అధికారులకు సంగీత, వారిలో ఉన్న రాజుపై అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే విక్రం పాత్ర గురించి చెప్పారు.
ముగ్గుర్ని కలిపి విచారిస్తే ఇందులో సంగీత తల్లి వెంకటమ్మ పాత్ర వెలుగు చూసింది. ఆమెను తన సొంతూరిలో అదుపులోకి తీసుకున్నారు. అందర్నీ రిమాండ్‌కు తరలించారు.