Telangana News: సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవ అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు పూర్తి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విశ్వసనీయతకు గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు ప్రాజెక్టుల మీద సమగ్రంగా చర్చించామని వివరించారు. నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్ పేరుతో వేలకోట్లు దండుకుందన్నారు. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కెసిఆర్ ఎప్పుడూ అనుకోలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు.
ముగ్గురు నేతలు మూడు చోట్ల ప్రారంభోత్సవం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంపు హౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరోవైపు అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ములకపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్ ను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు..
సీతారామ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఏర్పడనుంది. ఈ పథకం కింద దాదాపు 3.29 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు మీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు విత్తిపోతల పథకాలు స్థానంలో సీతారామకు గత కెసిఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read: జెండా పండుగ సాక్షిగా మద్యం అమ్మకాలు! కరీంనగర్‌లో విచ్చలవిడిగా
2016 ఫిబ్రవరి 16న రూ7,926 కోట్లతో దేనికి పరిపాలన అనుమతిని అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చింది. 2018లో ఈ అంచనా వ్యయం రూ.13,057.98 కోట్లకు పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులకు పెరిగిన ధరలు, ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి సుమారు రూ.18,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.7,919 కోట్ల రూపాయలకు ఖర్చు చేయగా, సుమారు మరో రూ.10 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేసేందుకే ముందుకు సాగుతోంది. దీనివల్ల లక్షలాది ఎకరాలు సాగులోకి రావడం వలన రైతులకు మేలు జరుగుతుందన్నది ప్రభుత్వ అంచనా. ఈ జిల్లాలోని మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచి ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లేలా ఒప్పించారు.
Also Read: ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ పెడుతున్నారా? అలా చేసే ముందు ఈ స్టోరీ చదవండి?