Karimnagar News: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి జయంతి రోజున మద్యం అమ్మకాలను నిషేధించిన విషయం విధితమే. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది మాకు మద్యం అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్న చందంగా ఆ రోజున మద్యం అమ్మకాలు పట్టపగలే జరుగుతున్నాయి. ఓవైపు అన్నిచోట్ల జాతీయ పతాకాలను ఎగురవేస్తుంటే మరోవైపు మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. మరి మద్యం అమ్మే వారికి ఈరోజు పంద్రాగస్టు అన్న విషయం గుర్తు లేదేమో అందుకే విచ్చలవిడిగా పట్టపగలే మద్యం విక్రయిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఓవైపు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోవైపు మందుబాబులు కార్లలో వచ్చి నడిరోడ్డు పైనే కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అంగట్లో టమోటాలు బెండకాయలు ఎలాగ అమ్ముతారో ఇక్కడ కూడా మందు కావాలా మందు కావాలా అంటూ పిలిచి మరి మద్యాన్ని విక్రయిస్తున్నారు.
అయితే కరీంనగర్ నడిబొడ్డున మద్యం క్రయ విక్రయాలు జరుగుతున్న తీరును ఏబీపీ దేశం గుర్తించింది. స్వాతంత్ర దినోత్సవం నాడు మద్యం అమ్మకాలే నిషేధం. అలాంటిది సామాన్యంగా అమ్మే రేటు కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్ముతున్నారు అన్న సమాచారం అందుకున్న తిమ్మాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా మద్యం విక్రయదారులు గుట్టుగా తరలించారు.