Telangana CM Revanth Reddy 1St Independence Day Speech: పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గోల్కొండకోట వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ తెలంగాణలో ఉందన్నారు. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని... లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించామన్నారు. మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నామని.. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చని... మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నామన్నారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు. 


ప్రజాస్వామ్య పునరుద్ధరణ


తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నామని దాన్ని అక్షరాలా అమలు చేస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నామని... ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 


సాంస్కృతిక పునరుద్ధరణ


అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన "జయ జయహే తెలంగాణ..." గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితిని భర్తీ చేశామన్నారు. ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో TS స్థానంలో TGని తీసుకొచ్చామన్నారు. 


అప్పులు కుప్ప 


తాము అధికారం చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందన్నారు. పదేళ్లలో ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం టైంలో 75,577 కోట్లుగా ఉన్న అప్పు, గతేడాది డిసెంబరు నాటికి దాదాపు 7 లక్షల కోట్లకు చేరిందన్నారు. 


అప్పులు భారం మోపబోం
అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోమన్నారు. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 


మహాలక్ష్మి పథకంతో  2,619 కోట్లు ఆదా 
ప్రభుత్వంలో కుదురుకోక ముందే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు ప్రారంభించామన్నారు. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 2,619 కోట్ల రూపాయలు ఆదా చేశామని వివరించారు. 


రాజీవ్ ఆరోగ్యశ్రీలో మరో 163 చికిత్సలు 
రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నది పేదవాళ్లు కూాడ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యాన్ని పొందాలని ఆరోగ్యశ్రీకి పూర్వవైభవాన్ని తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దీన్ని మరింత పటిష్టంగా అమలుపరిచేందుకు ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. కొత్తగా 163 చికిత్సలను ఇందులో చేర్చినట్టు వెల్లడించారు. ప్రస్తుంత 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతోందన్నారు. 


పౌరులకు డిజిటర్ హెల్త్ కార్డు 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తృత వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే చేస్తామని తెలిపారు. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటే సులభంగా రోగనిర్ధారణ, సత్వర చికిత్సకు వీలుంటుందనే ఈ ఆలోచన చేశామన్నారు. 


రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్, గృహజ్యోతితో వెలుగులు
2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ ధర 410 రూపాయలు ఉంటేనేడు అది 1200లకు చేరిందన్నారు. అందుకే తిరిగి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో మహాలక్ష్మీ పథకం ఫిబ్రవరి 27న ప్రారంభించామన్నారు. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం నేడు 43 లక్షల మందికి చేరిందన్నారు. పేదలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలన్న భావనతో గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 47 లక్షల 13 వేల 112 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 


వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ ప్రభుత్వం  ఉందన్నారు. అందుకే బడ్జెట్‌లో 72,659 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. రుణ భారంతో ఇబ్బంది పడ్డ రైతన్నలు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేష ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే... వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుందని తెలిపారు.


తొలిదశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణ మాఫీ సొమ్ము 6,098 కోట్ల రూపాయలను జూలై 18న రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు రేవంత్. దీనివల్ల 11 లక్షల 50 వేల మంది రైతన్నలు రుణవిముక్తి పొందారన్నారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలు జులై 30న జమ అయిందన్నారు. దీనివల్ల 6 లక్షల 40 వేల 823 మంది రుణ విముక్తి పొందారని తెలిపారు. ఇవాళ మూడో విడత మాఫీ ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పారు. 


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నామన్నారు. 31 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతును రుణ విముక్తుడిని చేశామన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు చెల్లించారన్నారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోందని తెలిపారు. 


ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం రాష్ట్రంలో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల అభిప్రాయాలు తీసుకొని విధి విధానాలు రూపొందిస్తోందన్నారు. అనంతరం పథకం అమలు చేస్తామని తెలిపారు. వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోందన్న రేవంత్‌ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారన్నారు. అందుకే సన్నరకం వరి ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 


రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌలభ్యం కోసం మొన్నటి రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178కి పెంచామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందన్నారు. 


కేంద్రం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకంలో చేరి రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేస్తామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుందన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి "రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. 


రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగిందన్నారు. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. 'ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ధరణిలో సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. 


ఇందిరమ్మ ఇళ్లు
పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.