Suryapet News: గవర్నమెంట్ జాబ్, అందులోనూ ప్రజలకు నిత్యం సేవలు అందించే పోలీస్ శాఖలో కొలువు సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం ఆ యువకుడు నిరంతరం శ్రమించాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కొట్టి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ విధి వక్రించింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
సమర్తపు లక్ష్మయ్య తన కుటుంబంతో సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ‌లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ పోలీస్ కావాలని, సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొన్ని నెలల కిందట నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ప్రిలిమినరీ పాసైన వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది పాసైన వారికి ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు. 
ఈ క్రమంలో మంగళ‌వారం ఉదయం డిగ్రీ కాలేజీకి వచ్చిన శ్రీకాంత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు శ్రీకాంత్ పరిస్థితి గమనించి ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లుగా తెలిపారు. కొన్ని నెలల్లో కుమారుడు పోలీస్ అవుతాడని, ప్రయోజకుడు అయ్యి తమ పేరు నిలబెడతాడని భావించిన తల్లిదండ్రులు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అవుతాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో లక్ష్మయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  


తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) పరీక్షకు సంబంధించి అక్టోబరు 27న ప్రారంభమైన 'పార్ట్-2' దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10తో ముగిసింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా పార్ట్-2 రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించమని అధికారులు ముందుగానే స్పష్టం చేయడంతో.. నవంబరు 10తో రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అభ్యర్థులు అర్హత సాధించిన నేపథ్యంలో 2,37,862 లక్షల మంది పార్ట్‌-2 దరఖాస్తులను సమర్పించిటన్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరిలో 1,91,363 మంది పురుషులు; 46,499 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్లు పంపించనున్నారు.


త్వరలో అడ్మిట్ కార్డు...
ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డు ఉంటేనే ఫిజికల్ ఈవెంట్లకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈవెంట్లకు హాజరయ్యే వారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
 అడ్మిట్ కార్డు 
 గుర్తింపు కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ 
 సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోకాపీ (క్యాస్ట్ సర్టిఫికేట్) సమర్పించాలి. 
➢  ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోకాపీ సమర్పించాలి. 
 ఆదివాసి గిరిజన ప్రాంతానికి చెందినవారైతే ప్రభుత్వం జారీచేసిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ సమర్పించాలి.