Rajagopal Reddy: తన రాజీనామా దెబ్బకు ఫాంహౌస్ లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడుకు వచ్చారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను మాట్లాడటానికి ఏమీ లేదని, ఏది చేసినా కూడా చేతలతోనే చేసి బొంద పెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను నమ్మించే తెలివి తేటలు కొన్ని రోజుల వరకు మాత్రమే నడుస్తాయని హెచ్చరించారు. ఆ తర్వాత ఎవరు నమ్మరని అన్నారు. బీజేపీ అంటే ఒక యుద్ధ నౌక అని, ఒక బండి సంజయ్, ఒక రఘునందన్ రావు, ఒక రాజాసింగ్ లాంటి క్షిపణలు ఉన్న యుద్ధ నౌక అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


'కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంది'


కేసీఆర్ కు అహంకారం ఎక్కువై, తనను ఎవరు ప్రశ్నించ వద్దు అనే ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు నుంచి ఈ కేసీఆర్ ను గద్దె దించాలని, టీఆర్ఎస్ ను బొంద పెట్టాలని తాను అనుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. "8 ఏళ్లలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుంది. నారాయణపూర్ లో ఇళ్లు వచ్చాయా.. రోడ్లు వచ్చాయా.. ఎవరి కోసం వచ్చింది తెలంగాణ..? కేసిఆర్ కుటుంబం కోసమా.. తెలంగాణ వచ్చింది వెయ్యి మంది పిల్లలు ప్రాణ త్యాగం చేసింది.. కేసీఆర్ కుటుంబం కోసమా.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రఘునందన్, వివేక్ వెంకటస్వామి, బండి సంజయ్ పోరాడుతున్నారు. ఇటీవల బూర నర్సయ్య గౌడ్ కూడా ఆ పోరాటానికి మద్దతుగా వచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. మూడున్నర ఏళ్లు అసెంబ్లీలో మాట్లాడితే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నువ్వు నీ అయ్యా.. ఇప్పుడొచ్చి గట్టుప్పల్ లో మాజీ సర్పంచ్ ను అన్నా రా.. అన్నా రా.. అని బతిలాడుతున్నావ్" అంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. 


'మునుగోడులో బీజేపీ గెలుపు దేశమంతా ధ్వనిస్తుంది'


అప్పుడు తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వచ్చినావో.. ఇప్పుడు నిన్ను బొంద పెట్టడానికి రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చిందని రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉపఎన్నికలో తనను ఓడించడానికి మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. వాళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ దగ్గర నిధులు తీసుకొచ్చే దమ్ము ఉందా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గడ్డ ఇదని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని అన్నారు. పేద ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్ ను గద్దె దింపుతామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. 15 రోజులు కష్టపడండి.. ఆరో తారీఖున వచ్చే విజయం భారతదేశం  అంత ప్రతి ధ్వనిస్తుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.