Munugode Bypoll : 300 మందిని యాదాద్రికి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహరంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వెయ్యాలని ఈసీ ఆదేశించింది. మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. లేని అధికారంతో గుర్తు మార్చి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈవీఎం బ్యాలెట్‌లో బోటు గుర్తుకు బదులు మరో గుర్తు ముద్రించిన చౌటుప్పల్‌ ఎమ్మార్వోపై సస్పెన్షన్‌ వేటు పడింది.  


గుర్తు మార్పుపై ఈసీ ఆగ్రహం 


మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 


రిటర్నింగ్ అధికారిపై వేటు 


ఈసీ ఆదేశాల మేరకు ఫారం 7(ఎ) సవరణ చేస్తూ అభ్యర్థి శివ కుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మారిన గుర్తులతో బ్యాలెట్‌ ముద్రణకు ఈసీ చర్యలు తీసుకోనుంది. నామినేషన్ దాఖలు చేసిన యుగతులసి అనే పార్టీకి చెందిన శివ కుమార్ తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారని, ఆ తర్వాత దాన్ని మార్చేసి బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన కాపీని కూడా జత చేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య కూడా గుర్తుల కేటాయింపులో గందరగోళం నెలకొందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తులు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. ఈ గుర్తుల కేటాయింపుపై ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి వివరణ కూడా కోరారు. అయితే, గుర్తులు మార్చాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బ్యాలెట్ పేపర్లు ప్రచురణకు పంపామని, ఈసీ ఏవైనా మార్పులు సూచిస్తే మారుస్తామని చెప్పారు. 


ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో


 మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథ రావును తప్పించి  రోహిత్ సింగ్ ను నియమించారు.  ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తును నిబంధనలకు విరుద్ధంగా మార్చిన ఘటనలో జగన్నాథరావుపై వేటు పడింది. యుగతులసీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును మొదట కేటాయించారు. తరవాత మార్చి  బేబీవాకర్‌ను కేటాయించారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తిరిగి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది.  


Also Read : గ్రామాలకు గ్రామాలు "దత్తత" తీసేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు - మునుగోడులో కొత్త వ్యూహం వర్కవుట్ అవుతుందా ?