Munugodu Adoption Politics :  మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన వ్యూహం దత్తత. గెలిపించండి..దత్తత తీసీసేసుకుటామని హామీ ఇస్తున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా చెప్పేవారు. నియోజకవర్గాన్ని, గ్రామాలను దత్తత తీసుకుంటున్నానని చెప్పేవారు. ఆయా గ్రామాలకు ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు విడుదల చేసేవారు. అయితే అలాంటి దత్తత గ్రామాలు ఎక్కువైపోవడంతో కేసీఆర్ కూడా దృష్టి సారించలేకపోయారు. అందుకే విపక్ష నేతలు అప్పుడప్పుడూ కేసీఆర్ దత్తత గ్రామాల్లో పర్యటించి.. పరిస్థితుల్ని మీడియాకు చూపించి విమర్శలు చేస్తూంటారు. అయితే ఈ దత్తత వ్యూహం బాగా వర్కవుట్ అవుతుందని టీఆర్ఎస్ నేతలకు గట్టి నమ్మకం. అందుకే ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ నేతలు మాటకంటే ముందే దత్తత తీసుకుంటామని చెబుతున్నారు. 


నియోజకవర్గాన్ని దత్తత  తీసుకుంటానన్న కేటీఆర్ !


టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో  ఆయనీ హామీ ఇచ్చారు.  న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తాను. అభివృద్ధిలో అండ‌గా ఉంటాను. రోడ్ల‌ను అభివృద్ధి చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచమని ప్రజల్ని కోరారు. మునుగోడును సిరిసిల్లలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 


గ్రామాలను దత్తత తీసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు !


మునుగోడులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేల్ని మునుగోడులో మోహరింప చేసింది. మంత్రులకు కూడా గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమకు అప్పగించిన చోట్ల మెజార్టీ తీసుకు రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. చేయాల్సినంత ఖర్చు చేస్తున్నారు. కానీ .. ఏదో లోపం ఉందని అనుకుంటున్నారేమో కానీ కేటీఆర్ ఫార్ములాను పాటిస్తున్నారు. తాము ప్రచారం చేస్తున్న గ్రామాల్లో ... టీఆర్ఎస్ గెలిస్తే దత్తత తీసకుుంటామని హామీ ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి ఇంచార్జీగా ఉన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే దత్తత తీసుకుంటానని ఊరికి సంబంధించిన రోడ్లు, కరెంట్ ఇతర పనులన్నీ చేసి పెడతానని హామీలిచ్చారు. ఇక మంత్రి ఎర్రబెల్లి కూడా  ఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే చండూర్ మున్సిపాలిటీ దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చేశారు. అంతేకాదు ఎమ్మెల్సీ రమణతో కలిసి డెవలప్ మెంట్ చేస్తానని ఓటర్లకు చెప్తున్నారు.  సందర్భం లేకకపోయినా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్.. నెక్ట్స్ సీఎం అవుతారని.. కాబోయే సీఎం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నారని.. అభివృద్ధి అవకాశాన్ని వదులుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.   


నియోజకవర్గం ఏమైనా అనాధా అని ప్రశ్నిస్తున్న విపక్ష నేతలు !


టీఆర్ఎస్ నేతల దత్తత రాజకీయాలపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు.  కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మనుగోడు నియోజకవర్గ ప్రజలు ఏమైనా అనాథలా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  మునుగోడులో టీఆర్ఎస్ కు సరైన నేతలే కరవయ్యారా? అంటే టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థి డమ్మీనా? అని సెటైర్లు వేస్తున్నారు. అధికార పార్టీ కొత్తగా దత్తత తీసుకోవడం ఎంటని, ఇప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని.. గతంలో దత్తత తీసుకున్న కొడంగల్ పరిస్థితి ఎంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల తర్వాత ఎంచెక్కా ఫామ్ హౌస్ ను తీసుకొండని  సెటైర్లు వేస్తున్నారు. 


అయితే ప్రజలు  మాత్రం దత్తత తీసుకుంటామనే తమ హామీల్ని నమ్ముతారని.. ఓట్ల వర్షం కురిపిస్తారని టీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వీరంతా కనిపిస్తున్నారని.. ఎన్నికలు ముగిసిపోతే ఎవరూ ఉండరని అక్కడి ఓటర్లకూ ఓ స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు వారికి ఎన్నికల మాయా ప్రపంచం కనిపిస్తోంది.