Andhra Politics :  పవన్ కల్యాణ్ 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనబోమని వైఎస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని ఆఫర్ ఇచ్చారు. "అన్ని సీట్లలో పోటీ చేసే సత్తా లేని పవన్.."  " దమ్ముంటే అన్ని చోట్లా పోటీ చేస్తానని ప్రకటించాలి" .. అనే డైలాగులు వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి తరచూ వినిపిస్తూంటాయి. రోజుకు ఇద్దరు, ముగ్గురైనా ఇలాంటి కామెంట్స్ చేస్తూంటారు. అయితే జనసేన పార్టీ రాజకీయ పార్టీ.. ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలో ఆ పార్టీ అధినేత నిర్ణయించుకుంటారు. మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు ? ఒంటరిగా పోటీ చేస్తేనే సరే...లేకపోతే విమర్శల దాడి చేస్తామని ఎందుకు అంటున్నారు ? జనసేన.. టీడీపీతో కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి వచ్చిన ఇబ్బందేమిటి ?


ఒంటరిగా పోటీ చేయాలని జనసేనానికి వైఎస్ఆర్‌సీపీ సవాల్ !


వచ్చే ఎన్నికల్లో వైసీపీ ముక్త ఏపీని సాధిస్తామని.. అందు కోసం ఓట్లు చీలకుండా చూసుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్‌సీపీ తీరులో మార్పు వచ్చింది. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలుస్తున్నారని విమర్శించడం ప్రారంభించారు. చంద్రబాబుతో కలవడం అంటే.. జనసైనికులకు ద్రోహం చేసినట్లేనని.. ప్యాకేజీ తీసుకునే ఇలా చేస్తారని ఆరోపించడం ప్రారంభించారు. ఆ ఆరోపణలు సవాళ్లుగా మారాయి. చివరికి పవన్ కల్యాణ్ .. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే ఓకే కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం తప్పేనని వైఎస్ఆర్సీపీ నేతలు వాదించడం ప్రారంభించారు. అయితే తమ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తాము తీసుకుంటామని.. మీకేం ఇబ్బందని జనసేన వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే జనసేన అడుగులపై వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ఉత్కంఠకు గురి అవుతోందని ఆ పార్టీ నేతల స్పందనను బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు. 


టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే ఇబ్బందని వైఎస్ఆర్‌సీపీ అనుకుంటోందా ?


జనసేన మద్దతుతో టీడీపీ 2014లో పోటీ చేసినప్పుడు టీడీపీ విజయం సాధించింది. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది. వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఇప్పుడు మళ్లీ టీడీపీకి దగ్గరవుతోంది. రెండు పార్టీలు కలిస్తే విజయం ఏకపక్షమన్న విశ్లేషణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. దీనికి కారణం ఉంది. స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో నేతలు ఎక్కడివక్కడ సర్దుబాటు చేసుకుని మంచి ఫలితాలు సాధించారు.  ఇది రెండు పార్టీల నేతల్ని ఆలోచనల‌లో పడేస్తోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల జనసేనకు వచ్చే ప్లస్ పాయింట్లేమీ లేకపోగా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే టీడీపీతో కలిస్తే ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఫీలింగ్ వస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఫలితాలు జనసేన చీల్చిన ఓట్లతో మారిపోయాయి. అదే సమయలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న కారణంగా ప్రత్యామ్నాయంగా ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జనసేనకు లాభిస్తుంది అనుకున్నప్పుడు ఆ పార్టీకి ఓటు వేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. ఇదే అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉందని తెలుస్తోంది. 


అధికార వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ అయితే అధికార పక్షానికి కష్టమే !


అధికారంలో ఉన్న పార్టీకి.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే లాభం. ఎంత చీలిపోతే అంత లాభం. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. వంద మందిలో యాభై ఒక్క మంది ఓట్లు తెచ్చుకోవాల్సిన పని లేదు.  ముఫ్పై మంది ఓట్లు తెచ్చుకున్నా చాలు..  అయితే తమ కంటే ఇతరులకు ఒక్క ఓటు కూడా ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అంటే ఎవరికీ 31 రానివ్వకూడదు. అలా జరగాలంటే ఎక్కువ మంది పోటీలో ఉండాలి. వంద ఓట్ల కోసం ఐదుగురు పోటీ పడి... ఒకరు 21.. ఒకరు 19.. మిగతా ముగ్గురు ఇరవై తెచ్చుకున్నా గెలుపు 21 తెచ్చుకున్న వారిదే. అధికారం అంతా అతనికే దఖలు పడుతుంది. ఈ రాజకీయం తెలుసు కాబట్టి.. విపక్షాల్ని ఏకం కానీయకుండా చూసుకుంటాయి అధికార పార్టీలు. కానీ ఏపీలో ఆ వ్యూహం ఫలించడం లేదు. జనసేన పార్టీ విడిగా పోటీ చేసే ఆలోచనలే లేదు. ఓట్లు చీలకుండా చేసి వైఎస్ఆర్‌సీపీని ఓడించాలని నిర్ణయించుకుంది. 


పొత్తులు పార్టీల ఇష్టం...విమర్శలు రాజకీయమే !


జనసేన అధనేత తమ బలాన్ని..బలగాన్ని అంచనా వేసుకుని  ఒంటరిగా పోటీ చేయాలా.. పొత్తులు పెట్టుకోవాలో డిసైడ్ చేసుకుంటారు. అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్‌సీపికి సంబంధం లేదు. ఆ పార్టీకి మేలు చేసేలా పవన్ నిర్ణయాలు తీసుకోరు. కానీ అలా తీసుకునేలా విమర్శలతో ఒత్తిడి చేయగలమని ఆ పార్టీ అనుకుంటోంది. కానీ పవన్ మాత్రం క్లారిటీగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.