KCR to address Meeting at Chandur: మునుగోడు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ విజయం కోసం మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మూలమూలకు పంపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ప్రచారం ఓ మోస్తరుగా జరిగింది. నేడు టీఆర్ఎస్ ప్రచారంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. చండూరు మున్సిపాలిటి పరిధిలోని బంగారిగడ్డ వద్ద సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున ప్రచారం చేసి మునుగోడు టీఆర్ఎస్ శ్రేణులకు మరింత బలాన్ని చేకూర్చనున్నారు. బై ఎలక్షన్స్ ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు.


బంగారిగడ్డలో సీఎం కేసీఆర్ సభ 
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు చండూరు మండలానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బంగారిగడ్డకు చేరుకోనున్నారు కేసీఆర్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. గులాబీ బాస్ ప్రచారంలోకి దిగనుండటం, అది బహిరంగ సభ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం కేసీఆర్ సభలో ఏ విషయాలు ప్రస్తావిస్తారో వినేందుకు ఆసక్తిగా ఉన్నారు.


ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మాట్లాడతారా ! 
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసిందని, తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలనాథులు కుట్ర పన్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సభ కావడం పార్టీకి ప్లస్ పాయింట్ కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశంపై ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. 






మరోవైపు మునుగోడుకు టీఆర్ఎస్ నియమించిన ఇంఛార్జ్ మంత్రి జగదీశ్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించిది. ఎన్నికల ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. ఈ ఆంక్షలు శనివారం సాయంత్రం అమల్లోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఎన్నికల ప్రచారంలో జగదీష్ రెడ్డి ఓటర్లను హెచ్చరించారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలను అందించారు.