JP Nadda Fake Hospital:  మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరడంతో అన్ని పార్టీలు తమ విజయం కోసం ముందుకెళ్తున్నాయి.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై  ఒక్కటీ అడక్కు అని బీజేపీ పోస్టర్లు విడుదల చేసింది. అందుకు బదులుగా జేపీ నడ్డా ఉత్తుత్తి హాస్పిటల్ స్కిట్ తో టీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన తెలిపారు. మునుగోడు స్థానికులతో కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. బీజేపీ నేతలు చెప్పిన అబద్ధాలను బట్టబయలు చేయడానికి జేపీ నడ్డా ఉత్తుత్తి హాస్పిటల్ థీమ్ తో  వీధి నాటకం వేశారు.


బీజేపీ ఇచ్చిన హామీలపై వీధి నాటకం ! 
గతంలో తెలంగాణలో పర్యటించిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. చౌటుప్పల్‌లో 300 పడకల ఆసుపత్రి, ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 2016లో జేపీ నడ్డా చెప్పిన మాటలు ఇంకా నిజం కాలేదని, మునుగోడు ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో మర్రిగూడ మండల కేంద్రంలో జేపీ నడ్డా ఫేక్ హాస్పిటల్ పేరుతో వీధి నాటకం ప్రదర్శించగా స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. మునుగోడు పర్యటనకు నడ్డా వచ్చినట్లుగా వచ్చిన వ్యక్తి చౌటుప్పల్ లో ఆసుపత్రి, ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ తాము ఏర్పాటు చేయబోతున్నామని హామీ ఇస్తారు. దాని ఫలితంగా 2022లో మునుగోడులో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందంటూ..  జేపీ నడ్డా ఉత్తుత్తి హాస్పిటల్ ను ప్రదర్శించారు. 






జూబ్లీమిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, స్థానికులు కలిసి ఈ నాటకాన్ని శనివారం మర్రిగూడ బస్టాండ్ వద్ద ప్రదర్శించారు. ఈ వీధినాటకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జేపీ నడ్డా ఉత్తుత్తి దవాఖానను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కేంద్రలోని బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, వారిచ్చిన హామీలు ఏమయ్యాయో టీఆర్ఎస్ నేతలు వీధి నాటకం ద్వారా చూపించడంతో స్థానికులు చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు.