Khammam SUDA Master Plan: ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఖమ్మం నగర మాస్టర్‌ ప్లాన్‌కు మోక్షం లభించనుంది. సుడా ఏర్పడిన తర్వాత మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు పాలకులు, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా సుడా పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసేందుకు ప్రభుత్వం స్టెమ్‌ అనే సాంకేతిక సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ ఆధునిక సాంకేతిక జీపీఎస్‌ విధానంతో మాస్టర్‌ ప్లాన్‌ను తయారుచేస్తుంది. ఇప్పటికే ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ను సంస్థ రూపొందించి సుడా అధికారులకు అందజేశారు. ఈ మేరకు ఇప్పటికే మొదటి దశలో భాగంగా స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం పూర్తి కావడంతో మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదమే తరువాయిగా మారింది.   
సుడా మాస్టర్‌ ప్లాన్‌..
స్థంభాద్రి అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటి (SUDA) పరిధిలోని ఖమ్మం కార్పోరేషన్‌ తో పాటు, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 46 గ్రామ పంచాయతీలకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్లాన్‌ను సిద్ధం చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమిపబ్లిక్‌ జోన్‌ల వివరాలను, రోడ్లు, వాటి వెడల్పుల వివరాలు, చెరువులు, కాలువలు, వాగుల వివరాలు మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచేందుకు ముసాయిదా ప్లాన్‌ను తయారుచేశారు. 
536 చదరపు కిలోమీటర్ల పరిధి వైశాల్యంతో ప్లాన్‌..
ఖమ్మం కార్పోరేషన్‌ (Khammam Corporation)తో పాటు 7 మండలాల్లోని 46 గ్రామ పంచాయతీ లతో ఏర్పడిన సుడాకు తయారు చేస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ పరిధి వైశాల్యం 536 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది. ప్రస్తుతం ఖమ్మం నగర పాలక సంస్థ ఉపయోగిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ 33 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి మాత్రమే తయారు చేశారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌లో కొన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్‌ జోన్లు, రోడ్ల వివరాలు సక్రమంగా లేవనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించేలా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ మాస్టర్‌ ప్లాన్‌ అమలులో ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. 
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని..
మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్న స్టెమ్‌ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ (Khammam SUDA Master Plan)ను రూపొందించింది. జీఐఎస్‌ బేస్‌తో గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ తయారు చేశారు. ప్రస్తుతం సుడా పరిధిలో 7,18,054 జనాభా ఉండగా, రాబోయే 20 ఏళ్లలో ఈ జనాభా 13,70,145కు పెరుగుతుంది, దీనిని దృష్టిలో పెట్టుకుని స్థల అవసరాలు, నీటి సౌలభ్యత, రోడ్లు, మౌలిక సదుపాయాలను, ఇతర అంశాలను బేరీజు వేసుకుంటూ మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. సుడాలోని రోడ్ల అనుసంధానం, రైల్వే లైన్, నేషనల్‌ హైవే, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వంటి వాటిని పరిగణలోకి తీసుకుని జోన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సుడాకు రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతాలను గుర్తించి మాస్టర్‌ ప్లాన్‌లో పెట్టడంతోపాటు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సుడా పాలకవర్గం నుంచి వచ్చే సూచనలతో త్వరితగతిన మాస్టర్‌ప్లాన్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Continues below advertisement


Also Read: Bandi Sanjay Letter To KCR: మేనిఫెస్టోలో హామీని ఎప్పుడు నెరవేర్చుతారు? సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ


Also Read: KCR Meets Sharad Pawar: దేశానికి సరికొత్త అజెండా, విజన్ అవసరం ! శరద్ పవార్‌తో భేటీ తర్వాత కేసీఆర్ ఏమన్నారంటే