వన దేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్లారు.. దర్శనం సాపీగా సాగడంతో పిల్లాపాపలతో ఆ జంట ఇంటికి చేరింది. దైవదర్శానికి వెళ్లడం వల్ల రెండు మూడు రోజులుగా ఇంట్లో ఉతికే బట్టలు ఎక్కువగా ఉండటంతో భార్యభర్తలు ఇద్దరు వాటిని ఉతికేందుకు కాల్వకు వెళ్లారు. భర్త కళ్లముందే భార్య కాలు జారి కాల్వలో కొట్టుకుపోతుండటంతో అది చూసిన భర్త ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దిగాడు. భార్యను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు కాల్వలో పడి మృత్యువాత పడ్డారు. భార్యను కాపాడేందుకు భర్త కాల్వలోకి దిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెకొడుకు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
ఆరెకొడుకు గ్రామానికి చెందిన ఆరెంపుల పరుశురాం తాపీ మెస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య నందని. వీరికి సుమశ్రీ, యశ్వంత్ అనే పిల్లలు ఉన్నారు. ఈ నెల 15న మేడారం వెళ్లి తిరిగి 17న ఇంటికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు మేడారం వెళ్లడం, ఇంట్లో ఉతికే బట్టలు ఎక్కువగా ఉండటంతో కూతురు సుమశ్రీని తీసుకుని దంపతులు ఇద్దరు ముత్తగూడెం, పల్లెగూడెం గ్రామాల మద్యలో ఉన్న సాగర్ కాల్వకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై కూర్చోబెట్టిన దంపతులు బట్టలు ఉతకడం కోసం కాల్వలోకి దిగారు. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నందిని కాలు జారి కాల్వలో పడిపోయింది.
ఈ సంఘటన చూసిన పరశురాం ఆమెను కాపాడబోయి కాల్వలోకి దూకాడు. పరుశురామ్‌కు ఈత వచ్చినప్పటికీ నందిని కాపాడే ప్రయత్నంలో ఆమె భర్త మెడ పట్టుకోవడంతో ఇద్దరు కాల్వలో కొట్టుకుపోయారు. ఇది చూసిన కూతురు సుమశ్రీ ఏడుస్తుండటంతో అటు వెళుతున్న వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృత దేహాల కోసం గాలింపు చేపట్టారు. కాగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించగా పరశురామ్ మృతదేహం ఇంకా లభించలేదు. పరుశురామ్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాదం..
తమ కోరికలు తీర్చే వనదేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్లి మూడు రోజుల పాటు పిల్లలతో సరదాగా గడిపిన పరశురామ్ దంపతులు కాల్వలో పడి మృతి చెందడంతో ఆరెకొడుకు గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలైన ఇద్దరు పిల్లలు వారి కోసం ఎదురు చూడటం గ్రామస్తులను కంటతడిపెట్టిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.