మేడారం మహాజాతర నేటితో (ఫిబ్రవరి 19) ముగింపు దశకు చేరుకుంటుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వనదేవతలు అటవీ ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. వడ్డెలు గద్దెలపై కొలువైన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లను వన ప్రవేశం చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా భ‌క్తులు భారీగా త‌ర‌లించారు. ప‌లువురు ప్రముఖులు కూడా స‌మ్మక్క – సార‌ల‌మ్మ అమ్మవార్లను ద‌ర్శించుకున్నారు. శుక్రవారం మేడారంలో భక్తులు కిక్కిరిసిపోయారు.


ప్రతి రెండు సంవ‌త్సరాలకు ఒకసారి.. అమ్మవార్లను తీసుకువ‌చ్చి.. గ‌ద్దెల‌పై ప్రతిష్ఠించి, నాలుగో రోజు తిరిగి వ‌న ప్రవేశం చేయిస్తారు. ఈ ఆదివాసి సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి వ‌స్తోంది. చివరిరోజు అమ్మవార్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి ఆమె చేరుకుంటారు. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా మేడారం రానున్నారు. గట్టమ్మ వద్ద నుంచి ర్యాలీగా మేడారం వచ్చేందుకు 200 వాహనాలను కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు.


మేడారం జాతరలో మూడో రోజు కూడా అదే జోరు కొనసాగింది. సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం భక్తులు మేడారానికి పోటెత్తారు. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా.. శుక్రవారం 25 లక్షల మందికిపైగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. లక్షలాదిగా భక్తులు రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడాయి. అమ్మల దర్శనానికి రెండు గంటలు పడుతోంది. నేటి సాయంత్రం తల్లుల వన ప్రవేశంలోగా మరో 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా చెబుతున్నారు.


మేడారం వెళ్లని కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మేడారం పర్యటనకు వెళ్తారని అధికారికంగా ప్రకటించినా చివరికి వెళ్లలేదు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కేసీఆర్ మేడారం వెళ్లలేదు. కనీసం ఎందుకు వెళ్లలేదో కూడా మీడియాకు, ప్రజలకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క - సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కేసీఆర్‌ మేడారంలో సుమారు 3  గంటలకుపైగా గడుపుతారని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఉంటారని, ఈ మేరకు ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పలుమార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు కూడా చేశారు.