Draupadi Murmu Yadadri Visit: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్  శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు, రాష్ట్రపతి ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అయితే యాదాద్రిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం. శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి సారథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజు హైదరాబాద్‌లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. 


బుధవారం రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న ముర్ము..


డిసెంబర్ 28 తేదీ బుధవారం రోజు రాష్ట్రపతి ముర్ము మధ్యాహ్నం సమయంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో రామప్ప ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలోనే మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లు ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో రాష్ట్రపతి బృందానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే (చీరను) మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్‌ వివరాలు, వరల్డ్‌ హెరిటేజ్‌ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్ కన్వీనర్‌ పాండురంగారావు వివరించారు. 


రామయ్యకు ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్రపతి


అంతకు ముందు అంటే ఉదయం భద్రాచలం రామయ్యను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అలాగే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.