Rahul Gandhi Arrives at Gannavaram Airport: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి పార్టీ ఏపీ చీఫ్ రుద్రరాజు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన రాహుల్ ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభకు రాహుల్ హాజరయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ ఖమ్మంలో భారీ సభకు ప్లాన్ చేసింది. 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న భారీ బహిరంగ సభ ‘జన గర్జన’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర నేడే ముగియనుండడం, జన గర్జన సభలోనే ఖమ్మం జిల్లా కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనుండడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మం సభ తర్వాత రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఖమ్మం సభ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ 5.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. తిరిగి రాత్రి 7.30 గంటలకు రాహుల్ తిరుగు ప్రయాణం అవుతారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తమకు ప్లస్ అవుతుందని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఐ కూటమి విజయం కోసం ఖమ్మంలో అప్పట్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగసభకు అప్పుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ జన గర్జన పేరుతో జరిగే సభకు ఖమ్మం రాహుల్ మళ్లీ ఖమ్మంకి వస్తున్నారు. రాహుల్ గాంధీ గత ఏడాది మే 6న వరంగల్ రైతు సంఘర్షణ సభ నుంచి వరుసగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ఆ తర్వాత భారత్​ జోడో యాత్ర సందర్భంగా అక్టోబర్​ 30న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​, నవంబర్​ 7న సంగారెడ్డి శివ్వంపేటలో బహిరంగ సభలను నిర్వహించారు. తాజాగా మరోసారి తెలంగాణ పర్యటనకు రాహుల్ వచ్చారు.


టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు, ప్రైవేట్ వాహనాలలో ఖమ్మం సభకు చేరుకుంటున్నారు. అయితే పోలీసులు ఆంక్షలు విధించి, కొన్ని కిలోమీటర్ల ముందే వారిని అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. నేతలు సభకు వచ్చే క్రమంలో ఏమైనా అనుకోని ఘటనలు జరిగితే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తమను అడ్డుకున్నా కాంగ్రెస్ శ్రేణులు సభా వేదికకు చేరుకుంటున్నారు.
Also Read: MP Komatireddy: 35 ఏళ్లలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదు, ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత: కోమటిరెడ్డి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial