Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని, రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. తమ సభలకు డబ్బులు కట్టినా ఆర్టీసీ వాహనాలను ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వస్తున్నా అడ్డుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ముందే హెచ్చరిస్తున్నాం... ఏం జరిగినా మాకేం సంబంధం లేదు. సభ తప్పకుండా జరుగుతుందన్నారు. జరగరానిది ఏం జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.
తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందని.. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. మరో 4 నెలలు పూర్తయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు చెప్పేది ఒక్కటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ సభకు భయపడి కేసీఆర్ ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు. పైగా కక్ష కట్టి ప్రైవేట్ వాహనాలను ఆపి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని తెలిపారు. ఎక్కడ వాహనాలు ఆపితే అక్కడికి వేలాదిగా బైకులపై వెళ్తాం.. జనగర్జన జరిపి తీరుతామని, ఈ క్రమంలో అనుకోని సంఘటనలు జరిగితే సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలని, కానీ సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో వాహనాలను ఆపి సభకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటివి చూడలేదు, కానీ సాధించుకున్న రాష్ట్రంలో ఇంత దారుణమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత. ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు, పోరాటాలు చేస్తుంటే ఇలా ప్రతిపక్షాల్ని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. న్యాయపరంగా పోరాడుతున్నాం, కానీ తాము హద్దు మీరలేదన్నారు. లక్షలమంది వచ్చి సభ సక్సెస్ అవుతుందని బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని సెటైర్లు వేశారు.
పోలీసుల్ని తోసుకుంటూ, తరుముకుంటూ రండి, కాంగ్రెస్ కార్యకర్తలకు నేతల పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు CLP నాయకుడు భట్టికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని చెప్పారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ స్పందిస్తూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడుతుందని అన్నారు. రాహుల్ గాంధీ వస్తున్న జన గర్జన సభకు జనం లక్షలాదిగా తరలివస్తున్న తరుణంలో సభకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial