Minister Mallareddy : మునుగోడు ఉపఎన్నికలో గెలుపుకోసం నేతల ఫీట్లు మొదలయ్యాయి. వంగి వంగి దండాలు పెట్టే రోజులు పోయాయి. ఓటర్లతో కలిసి సిట్టింగ్ వేసే రోజులు వచ్చాయంటున్నారు నేతలు. మంత్రి మల్లారెడ్డి ఓటర్లతో కలిసి మందుకొట్టి కంపెనీ ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చౌటుప్పల్ మండలం సైదాబాద్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఓ గ్రామానికి చెందిన కొంతమంది ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సమయంలో కొంతమంది వృద్ధులు మంత్రిని మద్యం కావాలని కోరారు. దీంతో మంత్రి తన సిబ్బందితో మద్యం తెప్పించి ఓటర్లతో కలిసి మద్యం సేవించారు. మంత్రి మందు తాగుతున్నప్పుడు ఒకరు సెల్ ఫోన్‌తో ఫొటో తీశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  






బంధువుల ఇంటికెళ్లా


ఓటర్లతో మందు పార్టీ ప్రచారంపై మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. గుండ్లబావిలో తన బంధువుల ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యానన్నారు. ఆ సమయంలో బంధువులతో కలిసి మద్యం సేవించిన ఫొటోలపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  తన బావలు, సోదరులకు తాను మందు పోశానని అందులో తప్పేందని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  


అదంతా దుష్ప్రచారం  


"గత ప్రభుత్వాలు నల్గొండ జిల్లా వాసులకు ఏంచేయలేదు. ఫ్లోరైడ్ వాటర్ తో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. నల్గొండ వాళ్లకు ఎవరూ పిల్లనియ్యక పోయే, పిల్లను చేసుకోకపోయే. సీఎం కేసీఆర్ వచ్చాక నల్గొండ వాసులకు మంచి వాటర్ అందించారు. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్లంతా దివాళా తీశారు. ఎక్కడా వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు. ఈ ఫొటోలో 150 మంది లేరు. అదంతా అవాస్తవం. రెడ్డిబావిలో మా చుట్టాలున్నారు. నేను మంత్రి అయ్యాక వాళ్లింటికి పోలేదు. నిన్న ప్రచారానికి పోతే వాళ్లు భోజనానికి రమ్మన్నారు. భోజనానికి రమ్మంటే వెళ్లాను. ఐదారుగురే కూర్చున్నాం.  వాళ్లంతా పెద్ద వాళ్లు మా అన్నలు, బావలు ఉన్నారు. నిన్న సండే కదా సరదాగా మద్యం తాగారు. ఇంట్లో కూర్చొన్న ఫొటోను వైరల్ చేస్తున్నారు. వాళ్లంతా మా బంధువులే. మంత్రి అయ్యాక వారింటికి పోలేదని వెళ్లాను. అది వేరే వాళ్ల ఇళ్లా? చుట్టాల ఇంట్లో కూర్చోవడం కూడా తప్పా? నేనేమీ చాటుకు పోలేదు. మా గన్ మెన్లు కూడా అక్కడే ఉన్నారు. పండగనాడు పెద్ద మనుషులకు సీసా తీసుకుని మందు పోస్తే తప్పా?. బీజేపీ వాళ్లు మొత్తం ఫ్లాప్ అయ్యారు. కాంగ్రెస్ దివాళా తీసింది. అందుకు దుష్ప్రచారాలు చేస్తు్న్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ ఉంది. ఏం చేసింది."- మంత్రి మల్లారెడ్డి