Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితం జనగామ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కుక్కలను పిల్లులుగా మార్చేందుకు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నట్లు సీఎం కేసీఆర్ తనతో చెప్పారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి
పల్లా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు నష్టం కలిగిస్తాయని జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాజేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాత్రం తనకు మూడోసారి టికెట్ ఇచ్చి పోటీలోకి దింపాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ టికెట్ ఆశించారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. అధికార పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నాలుగు నియోజకవర్గాల్లో జనగామ కూడా ఉండటం గమనార్హం.
తన వ్యాఖ్యలను పల్లా సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి తప్పుడు మాటలు అనలేదని అంటున్నారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా కామెంట్ చేస్తున్నారు.
ముగ్గురు బలమైన పోటీదారులు ఉండడంతో టికెట్ పెండింగ్ లో
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2018లోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసే అవకాశం ఉంది. జనగామలో బీఆర్ఎస్ టికెట్ కోసం ముగ్గురు బలమైన పోటీదారులు ఉండటంతో కేసీఆర్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. 2018 లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకున్న కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఫిరాయింపులతో 119 మంది సభ్యుల అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 104కు చేరుకుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఇదే వ్యూహాన్ని అనుసరించారు. అయితే పార్టీ బలోపేతం అమలు చేసిన ఈ వ్యూహం వల్ల కొన్ని ప్రాంతాల్లో పార్టీకి నష్టం వాటిల్లింది. నేతల మధ్య అసమ్మతి పార్టీని, కార్యకర్తలను విడదీసింది. కాంగ్రెస్ పార్టీపై గెలిచి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించడం, అప్పటికే ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్ రాకపోవడం వల్ల అసమ్మతి పెరిగింది.