Telangana Minister Ponguleti Thanks to Chandrababu: తెలంగాణ ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు (Minister Ponguleti Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తెలంగాణలో  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారాయన. ఖమ్మం (Khammam) జిల్లా టీడీపీ (TDP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పొంగులేటి. తెలంగాణలో టీడీపీ  వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని... స్పష్టం చేశారు. అందుకు గాను... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ (Nara Lokesh)కు, టీడీపీ శ్రేణులకు  కృతజ్ఞతలు తెలిపారు. 


తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీకి టీడీపీ మద్దతు పలికిందన్నారు మంత్రి పొంగులేటి. టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. నియంతృత్వ, అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ తమతో కలిసి పనిచేసిందని చెప్పారాయన.  తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా....  తమ ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి.. 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ వేర్వేరు కాదని... రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు పొంగులేటి. అధికారంలో లేమని టీడీపీ నేతలు బాధపడాల్సిన అవసరంలేదని... భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు. 


పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. లోపాయికారీ ఒప్పందాలతో... కుట్ర రాజకీయాలు చేసి... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని ఆరోపిస్తున్నారు. అందుకు...పొంగులేటి వ్యాఖ్యలే నిదర్శనమని చెపున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఒప్పుడు పొంగులేటి చెప్పిన మాటలే... తాము ముందు నుంచి చెప్తూ వచ్చామన్నారు. కాంగ్రెస్‌ నేతలంతా టీడీపీ ఏజెంట్లేని తాము చేసిన ఆరోపణలు నిజమని పొంగులేటి తన మాటలతో నిరూపించారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయలేదని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని... కుట్రలు చేశారని మండిపడుతోంది. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నేతలు ఎవరెవరు, ఎవరెవరితో చేతులు కలిపారో, చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.


అంతేకాదు... టీడీపీని ఆకాశానికి ఎత్తేసిన పొంగులేటి.. కాంగ్రెస్‌ కార్యకర్తలను కించపరిచారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి... తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ.... టీడీపీ క్యాడర్‌ మాత్రం నిద్రపోకుండా పనిచేసిందన్నారు. అంటే.. సొంతపార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన అవమానించనట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా పొంగులేటి వ్యాఖ్యలు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్‌, టీడీపీ ఒకటే అని ఆయన చెప్పడం.. అది కూడా పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అసలు మతలబేంటనే చర్చ జరుగుతోంది. ఇక వ్యూహం ప్రకారమే ఆయన మాట్లాడారని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.... కాంగ్రెస పార్టీ మరోసారి టీడీపీ మద్దతును కోరుకుంటోందని అంటున్నారు. మరోవైపు... బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం... కాంగ్రెస్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది.