Minister KTR : ఉద్యమపార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అనే ప్రకటన కూడా చేసేశారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు వస్తే పూర్తి స్థాయిలో జాతీయ పార్టీగా మారినట్లే. అయితే జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కొన్ని ప్రమాణాలు పొందాల్సి ఉంది. కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అయినా లేదా నాలుగు రాష్ట్రాల పరిధిలోని లోక్ సభ స్థానాల్లో అయినా ఆరుశాతం ఓట్లతో పాటు 4 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కు ఉన్న బలానికి నాలుగు ఎంపీ సీట్లు గెలవడం కష్టం కాకపోవచ్చు. కానీ నాలుగు రాష్ట్రాల్లో ఆరుశాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. లేకుంటే కనీసం 2శాతం లోక్‌సభ సీట్లను అంటే 11 సీట్లను మూడు రాష్ట్రాల ప్రాతినిధ్యంతో గెలవాల్సి ఉంటుంది. ఇవి గుర్తింపు కోసం పాటించాల్సిన నిబంధనలు. టీఆర్ఎస్ 11 లోక్ సభ సీట్లను గెలుచుకున్నా ప్రయోజనం లేదు. మరో రెండు రాష్ట్రాల్లో ఒక్కో లోక్ సభ స్థానంలో అయినా గెలవాల్సి ఉంటుంది.


మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ  


టీఆర్ఎస్ మాత్రం నేరుగా టార్గెట్ 2024 ఎన్నికలు అనే చెబుతోంది. మొత్తం దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. జాతీయ స్థాయిలో అడుగులు వేయాలంటే పై రెండు నిబంధనలు తప్పనిసరి కావడంతో ఈ లోగా ఎక్కువ రాష్ట్రాల్లో ఓట్లు సాధించడం లేదా లోక్ సభ సీట్లు సాధించడం ఏదో ఒకటి చేయాల్సి ఉంది. అందుకే జనరల్ ఎలక్షన్ కంటే ముందే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పై అభిమానం ఉందని అక్కడి ప్రజలు టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ ప్రాంతాలను తెలంగాణలో కలపండని కూడా అడుగుతున్నారని కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ లో అన్నారు. కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. అయితే  వెంటనే రాబోతున్న గుజరాత్ ఎన్నికల్లో పోటీ విషయంపైనా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, సమయం తక్కువుగా ఉన్నందున ఏం చేయాలన్నది కేసీఆర్ డిసైడ్ చేస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 


ఆంధ్రాలో ఆ తర్వాత 


పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడిన కేటీఆర్ మొన్నటి వరకూ కలిసి ఉన్న ఆంధ్రాపై మాత్రం ఆచితూచి మాట్లాడారు. జాతీయ పార్టీ ప్రకటనకు 7-8 నెలలకు ముందు నుంచే ఇతర రాజకీయ నాయకులతో కేసీఆర్ మాట్లాడారు అని చెప్పిన కేటీఆర్. మరి పొరుగు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడారా అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేదు. ఏపీ గురించి తొందరెందుకు అని సమాధానం దాటవేశారు. అక్కడ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉందని, తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ అంటే తెలియని వాళ్లున్నారా అని మీడియానే తిరిగి ప్రశ్నించారు. 


చంద్రబాబు రియాక్షన్ చూశా 


బీఆర్ఎస్ ప్రకటనపై చంద్రబాబు స్పందించిన విధానంపై కేటీఆర్ కాస్త అఫెండ్ అయినట్లు కనిపించింది. చంద్రబాబు స్పందనను చూశామని"మా పార్టీ ప్రకటనపై నవ్వారు అంట కదా" అన్న ఆయన. "సరే మేం కూడా చూస్కుంటాం" అన్నట్లుగా  రియాక్ట్ అయ్యారు. 


పేరు మారింది.. జెండా కాదు
 
పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకపోయినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అనే పదానికి సెంటిమెంట్ ఉందని అయితే జాతీయ స్థాయిలో అడుగు పెడుతున్నప్పుడు.. ప్రాంతీయ భావన రాకుండా ఉండటానికే పేరు మార్పు చేశామని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్ అనేది తెలంగాణ నుంచి వచ్చే జాతీయ పార్టీ అవుతుందన్నారు. పార్టీ జెండా.. అజెండా.. గుర్తు.. లీడర్  ఏం మారడం లేదని కేవలం పేరు మాత్రమే మారడం వల్ల సమస్య ఏం ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో  రాజకీయ పార్టీలకు కారు గుర్తు కేటాయించవద్దని ఈసీఐకు విజ్ఞప్తి చేశామని, పార్టీ పేరు మార్పును త్వరలోనే ఈసీ గుర్తిస్తుందని కేటీఆర్ చెప్పారు.