కళ్లయినా తెరవని నెలల పసిగుడ్డుకు అమ్మ లేకపోవడం హృదయాన్ని కలచివేసే సంఘటన! అదే పసికందుకు ఒక ఆవే లేగదూడతో సహా వచ్చి అమ్మగా మారడం కళ్లు చెమర్చే దృశ్యం! తల్లి లేని ఆ పసిబిడ్డకు ఆవును కానుకగా ఇచ్చింది ఎవరో కాదు! తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్‌ రావు! ఓ వార్తాపత్రికలో బిడ్డ ఆకలిపై వచ్చిన మానవీయ కథనాన్ని చూసి చలించిన హరీష్ రావు పసిబిడ్డ ఆకలితీర్చి, గూడెం ప్రజల మనుసులు గెలుచుకున్నాడు!


అమ్మ- ఆవు! ఈ రెండు పదాల్లోని మొదటి అక్షరాలు పక్కపక్కనే ఉండటం యాదృచ్ఛికమే కానీ,  ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. అమ్మ లేని లోటుని ఆవు తీరుస్తుందని మనసుకు అర్ధమవుతుంది. అందుకే అమ్మ- ఆవు రెండూ ఒకటే అనే మాటను ఈ వార్త రుజువు చేసింది. అసలు విషయానికొస్తే.. పసిపాప ఆకలి తీర్చేందుకు పది కిలోమీటర్ల ప్రయాణం..ఈ పేరుతో వచ్చిన వార్తను చూసి మంత్రి హరీశ్ రావు చలించిపోయారు. వెంటనే ఆ పాపను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుమూల ప్రాంతమైన రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి PHCలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 10 రోజులకే ఆ తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి కళ్లయినా తెరవని పసిగుడ్డు ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపూరావు పడరాని పాట్లు పడ్డారు. బిడ్డ ఆకలి తీర్చేందుకు పాల ప్యాకెట్ కోసం రోజూ 10 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఎందుకంటే, గూడెంలో ఎవరికి ఆవు గానీ, గేదెగానీ, మేకగానీ లేదు. ఇదే సమస్యగా మారింది.


 ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు తక్షణం ఆ బిడ్డకు సాయం అందించాలని అనుకున్నారు. హుటాహుటిన అధికారులను ఆదేశించారు. బిడ్డకు పాల కొరత లేకుండా ఉండేలా ఒక ఆవును సమకూర్చాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు, సమీప PHC సిబ్బంది ఆ పసికందు వద్దకు వెళ్లి పాలప్యాకెట్లు, అవసరమైన పౌష్ఠికాహారం డబ్బాలు అందించారు. ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.


తండ్రి కోరిక మేరకు శాశ్వత పరిష్కారంగా, పాలిచ్చే ఆవును కొనుగోలు చేసి అందజేశారు. ఒక ట్రాలీ ఆటోలో లేగదూడతో సహా తీసుకువచ్చి ఆ కుటుంబానికి అందజేశారు. ఎలాగూ గిరిజన ప్రాంతమే కాబట్టి, గడ్డికి కొరత ఉండు. బిడ్డకు ఇక పాలు లేవనే సమస్య కూడా ఉండబోదని సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తమకు తెలియజేయాలని వైద్య సిబ్బంది బిడ్డ తండ్రి, తాతకు సూచించారు.


మానవీయ కోణంలో స్పందించి, పసికందుకు పాలు అందించేందుకు ఆవును తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హరీశ్ రావుకు చిన్నారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బిడ్డను బాగా చూసుకుంటామని, మంత్రి అందించిన ఆవును గొప్ప బహుమతిగా భావిస్తామని గూడెం ప్రజలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా, మంత్రి హరీశ్ రావు స్పందించడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. గూడెంప్రజలు పేరుపేరునా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.