ఏ అమ్మాయికైనా, లేదంటే అబ్బాయికైనా వారి వివాహం చేసుకునే భాగస్వాములు మంచి వారై ఉండాలని అనుకుంటారు. మంచి భర్త కావాలని, మంచి భార్య దొరకాలని కలలు కంటుంటారు. అలా మంచి లక్షణాలున్న భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ పెళ్లి చేసుకునే వయస్సు దాటిపోతూ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయికి దొరకకపోతే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే కేవలం పెళ్లి కావడం లేదనే బాధతో ఏకంగా సూసైడ్‌ చేసుకున్నవాళ్లు కొందరైతే.. ఏకంగా మాజీ సీఎంకే లేఖ రాసిన పెళ్లికానీ ప్రసాద్‌లు చాలానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు, పెళ్లి కావడం లేదన్న మనోవ్యథతో ప్రాణాలు తీసుకుంటున్న మగవారి సంఖ్య పెరుగుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి.


ఎందుకీ ఆత్మహత్యలు.. 
గత ఏడాది 2021లో దేశవ్యాప్తంగా కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి శాతం మొత్తం ఆత్మహత్యల్లో 56.6 శాతం ఉన్నట్లు ఎన్సీఆర్బీ రికార్డులలో తేలింది. ఇందులో వివాహంతో ముడిపడి ఉన్న ఆత్మహత్యలు 4.8శాతం ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. మరోపక్క పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలామంది సమాజంలో ఉన్న యువతీ యువకులు పెళ్లి సమస్య కారణంగా కెరియర్ పై సరైన అవగాహన దృష్టి పెట్టలేకపోతున్నారు. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగం తర్వాత జీవితంలో అతి ముఖ్య ఘట్టం పెళ్లి. ఒక పక్క ఉద్యోగాలు లేక మరో పక్క పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో.. పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు, బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది.


పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం సాఫీగా జరగాలంటే ఒక అద్భుతమైన జాబ్ ఉంటేనే అవతలివాళ్ళు కమిటీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది.  ఇక గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువగా అబ్బాయిలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యలకు కారణమవుతున్న కుటుంబ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది వివాహం. వైవాహిక సంబంధ సమస్యలతో పురుషులు ప్రాణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది. అయితే నిజానికి మహిళలు మానసికంగా సున్నితంగా బలహీనంగా ఉంటారన్నది సమాజాంలో వినిపించే అభిప్రాయం. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇందుకు భిన్నంగా మానసిక మనోవేదనకు గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.


తెలంగాణలో పరిస్థితి ఇదీ.. 
2020లో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకున్న మగవారి సంఖ్య 1348గా ఉంటే, అదే 2021 వచ్చేసరికి ఆ కారణంతో ప్రాణాలు తీసుకునే మగవాళ్ల సంఖ్య 1616కు పెరిగింది. కానీ.. మగవాళ్లలో ఆత్మహత్యలు పెరిగినట్లు రికార్డులలో కనిపిస్తున్నప్పటికీ, ఆడవాళ్లలో ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెళ్లి సెటిల్ కాలేదన్న మనోవేదనలో తెలంగాణ రాష్ట్రంలో 71మంది మగవాళ్లు, 23 మంది ఆడవాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో 8 మంది సూసైడ్ చేసుకుంటే, అందులో ఒక్కరు కూడా ఆడవాళ్లు లేరని ఎన్సీఆర్బీ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


ఏపీలో ఆత్మహత్యలు.. 
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 18 మంది మగవారు, 9 మంది ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తల కాపురాలు సాఫీగా సాగుతున్నయా..? అంటే.. కచ్చితంగా లేవనే విషయం కూడా సర్వే తేలింది. అయితే భార్యభర్తలు విడాకులు తీసుకుని ఎవరి జీవితాలకు నచ్చినట్లు వాళ్లు బ్రతకడం వరకు బాగానే ఉంది. కానీ.. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల వాళ్ల పిల్లల జీవితాలే చిద్రమవుతున్నాయనే చెప్పాలి.