Telangana Elections 2023: ఓ బాలుడు మంత్రి హరీష్ రావు(Harish Rao)ను మెప్పించాడు. తన కిడ్డీ బ్యాంకు(Kiddy Bank)లో దాచుకున్న మొత్తాన్ని మంత్రి ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చేశాడు. వివరాలు.. సిద్దిపేట నుంచి హరీష్ రావు BRS అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. హరీష్ రావు 7వ సారి సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సిద్దిపేట సీనియర్ జర్నలిస్ట్ కలకుంట్ల రంగాచారి ఇంటికి వెళ్లారు.


అక్కడ రంగాచారి తనయుడు మాస్టర్ కలకుంట్ల నచికేత హరీష్ రావును శాలువాతో సన్మానించాడు. అనంతరం కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బు రూ.3,295ను తండ్రి రంగాచారితో కలిసి  మంత్రికి అందజేశాడు. రాజకీయాలకే కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మంత్రి హరీష్ రావుకు ఉడతా భక్తిగా సాయంగా తన కిడ్డీ బ్యాంకులోని డబ్బును అందించినట్లు నచికేత తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాస్టర్ నచికేతను అభినందించారు. 


నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు
మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరారు.


నామినేషన్ అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవని, నేడు రాష్ట్రాన్ని కేసీఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్ష 80 వేల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 


దేశానికి దిక్సూచిగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని హరీష్ రావు అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటుందో కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉందన్నారు. కేసీఆర్‌ని కాదని బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే రాష్ట్రం 10 ఏళ్లు వెనుకకు వెళ్లిపోతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదన్నారు. సెన్సేషన్ అవడం కోసం కొందరు సీఎం కేసీఆర్‌పై నోరు జారుతున్నారని మండిపడ్డారు.


2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిథ్యం
హరీశ్‌ రావు 2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో 24,827 మెజార్టీతో విజయం సాధించారు. తరువాత 2008 ఉప ఎన్నికల్లో 58,935 మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో హరీష్  రావు తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్లు, 2010 ఉప ఎన్నికల్లో 95,858 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజారిటీ రాగా, 2018 ఎన్నికల్లో 1,18,699 మెజార్టీతో చరిత్ర సృష్టించారు.