KTR News :  తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బ్రిరట‌న్‌కు చెందిన ప్ర‌ఖ్యాత బ్యాంకింగ్ సంస్థ లాయిడ్స్ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. లాయిడ్స్ గ్రూప్ సంస్థ ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. త‌మ టెక్నాలజీ సెంటర్ ను  త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ప్రారంభించేందుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకు వ‌చ్చిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. తొలి ఆరు నెల‌ల్లోనే 600 మందిని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ నియ‌మించుకోనుంది. అమెరికా, యూకే ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా మే 13వ తేదీన లాయిడ్స్ బృందంతో స‌మావేశ‌మైన‌ట్లు కేటీఆర్ తెలిపారు. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే హైద‌రాబాద్‌లో త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌డంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్య‌క్తం చేశారు. 2.8 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌తో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవ‌లందిస్తుంది. 





మే నెలలో కేటీఆర్ రెండు వారాల పాటు  యూకే, యూఎస్ లలో పెట్టుబడుల పర్యటించారు.  రెండు వారాల్లో రెండు దేశాల్లోని బడా బడా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏకంగా 80కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, మీడియా, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైసెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్ అండ్ డేటా సెంటర్ ఇలా పలు రంగాల్లో దూసుకెళ్తోన్న సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఒప్పించారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల ద్వారా.. తెలంగాణలో డైరెక్టుగా 42 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే టైర్-2 సిటీలైన నల్గొండ, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ కంపెనీలను విస్తరించనున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలతో ఆయా కంపెనీల ప్రతినిధులు ఒక్కొక్కరుగా తెలంగాణకు వస్తున్నారు.