BRS News :  తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణం తీసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎంకేసీఆర్ నిర్ణయించుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. శంకరమ్మకు ఇందులో అవకాశం కల్పించే అవకాశం ఉంది. గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది.  ఆయన విజయం సాదించారు.  అప్పటి నుంచి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు.          


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు.   21 రోజుల పాటు వివిధ అంశాలపై ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. చివరి రోజు మాత్రం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు కేటాయించారు.   తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలుఉన్నాయి.                                                                           
 
శ్రీకాంతా చారి ఎల్పీనగర్ చౌరస్తాలో ఆత్మాహుతి చేసుకున్నారు. అందుకే ఇటీవల అఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ నిర్ణయంపై  శ్రీకాంత్ చారి తల్లి కూడా స్పందించింది. ‘నా కొడుకు త్యాగానికి ఇది సరైన నిర్ణయం. తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో నా కొడుకు పెట్రోల్ పోసుకుని మాంసం కరగపెట్టుకున్నాడు. అయితే నిన్న కేటీఆర్ చేసిన పనికి మా కొడుకు ఆత్మా శాంతిస్తుంది. నా మనసు కూడా తృప్తి పడింది. చనిపోయిన నా కొడుకుకు మళ్ళీ ప్రాణం పోసినట్టు నాకు అనిపిస్తుంది’ అంటూ భావోద్వేగం అయ్యారు అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ.  ఇది జరిగిన కొద్ది రోజులకే..  బీఆర్ఎస్ హైకమాండ్ ఆమెకు గుడ్ న్యూస్ చెప్పింది.                              


అమరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాంగా ఆరోపణలు వస్తున్నాయి . వీటిని  తిప్పికొట్టేందుకు శ్రీకాంతాచారి తల్లికి పదవి  ఇస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో  వైపు బీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు.. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చూస్తున్నారు.  ఒక సీటు అనూహ్యంగా శంకరమ్మకు కటాయించడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.