Liquor Price: Telangana Hikes Liquor Price from 19 May: హైదరాబాద్‌: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను మరోసారి భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీర్ మీద రూ.20 మేర భారీగా ధర పెరిగింది. అదే విధంగా క్వార్టర్ మద్యం ధరను సైతం రూ.20 మేర భారీగా పెంచి మందుబాబులకు షాకిచ్చారు. క్వార్టర్‌ పై రూ.20, ఆఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మీద రూ.80  పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు రేపట్నుంచి (మే 19 నుంచి) అమలుకానున్నాయని సమాచారం. 


నిల్వ ఉన్న మద్యాన్ని లెక్కించి రేపటి నుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. దుకాణాల్లో ఇవాళ్టి అమ్మకాలు పూర్తి కాగానే ఆబ్కారీశాఖ అధికారులు మద్యం సీజ్‌ చేయనున్నారని సమాచారం. తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డులు తిరగరాస్తున్నాయి. కరోనా వ్యాప్తి తరువాత రెండేళ్లకు బీర్లు, మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవికాలం కావడంతో సేదతీరేందుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి.


90 శాతం పెరిగిన సేల్స్.. 
గత ఏడాది మే నెలతో పోల్చితే ఈ ఎండాకాలం సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం అధికంగా నమోదయ్యాయి. బీర్లతో పాటు ఇతర లిక్కర్ అమ్మకాలు కూడా పెరిగాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. గత మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల రూపాయల బీర్ల అమ్మకాలు జరిగాయి. మార్చి నుంచి మే 14వ తేదీ వరకు మొత్తం 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ విక్రయం జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఈ మే నెలలోనే ఇప్పటిదాకా మద్యం ప్రియులు రూ.10.64 కోట్ల లీటర్ల బీరు సీసాలను తాగేశారని లెక్కలు చెబుతున్నాయి. గతంలో కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా బీర్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే ఈ సారి మాత్రం ఆ లోటును పూర్తిగా అధిగమించి పెరిగాయి. 


రంగారెడ్డి టాప్.. 
ఇక జిల్లాల వారీగా చూస్తే బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో రూ.2.38 కోట్ల లీటర్ల బీర్ల విక్రయం జరిగింది. రూ.1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్‌ రెండో స్థానంలో ఉంది. లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెబుతున్నాయి.


Also Read: Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే