తెలంగాణలో బీర్లు ఏరులై పారుతున్నాయి. బీర్ల అమ్మకాలకు సంబంధించి తాజా లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓ పక్క తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తుంటే, వాటి నుంచి ఉపశమనం పొందడానికి లిక్కర్ ప్రియులు బీర్లు పుచ్చుకుంటున్నారు. గత ఏడాది మే నెలతో పోల్చితే ఈ ఎండాకాలం సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం అధికంగా నమోదయ్యాయి. బీర్లతో పాటు ఇతర లిక్కర్ అమ్మకాలు కూడా పెరిగాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు.
గత మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల రూపాయల బీర్ల అమ్మకాలు జరిగాయి. మార్చి నుంచి మే 14వ తేదీ వరకు మొత్తం 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్ విక్రయం జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఈ మే నెలలోనే ఇప్పటిదాకా మద్యం ప్రియులు రూ.10.64 కోట్ల లీటర్ల బీరు సీసాలను తాగేశారని లెక్కలు చెబుతున్నాయి. గతంలో కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా బీర్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే ఈ సారి మాత్రం ఆ లోటును పూర్తిగా అధిగమించి పెరిగాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో రూ.2.38 కోట్ల లీటర్ల బీర్ల విక్రయం జరిగింది. రూ.1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్ రెండో స్థానంలో ఉంది. లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెబుతున్నాయి.
సగం వాటా బీర్లదే..
ఈ ఏడాది జనవరి - మే 15వ తేదీ వరకూ జరిగిన మద్యం విక్రయాల్లో సగానికి పైగా వాటా బీర్లదే అని ఎక్సైజ్ శాఖ లెక్కలు స్పష్టం చేశాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది మే 15 వరకూ రంగారెడ్డిలో 4,68,56,640.. హైదరాబాద్‌లో 1,74,20,700.. మేడ్చల్ జిల్లాలో 97,16,424 బీర్ల అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.